మన తెలంగాణ/హైదరాబాద్: కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథపై దాఖలైన పోక్సో కేసు వ్యవహారం కాంగ్రెస్‌లో అలజడి సృష్టించింది. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చేసిన సూచనపై ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బి. మహేష్ కుమార్ గౌడ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఏకంగా మంత్రి పొన్నం వ్యాఖ్యలతో తమ పార్టీకిగానీ, ప్రభుత్వానికి గానీ ఏ మాత్రం సంబంధం లేదని తేల్చి చెప్పారు. పూర్వాపరాల్లోకి వెళితే బండి భగరథ ఫోక్సో కేసు వ్యవహారంపై మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియాతో మాట్లాడుతూ ఈ కేసుకు పరిష్కార మార్గంగా పెళ్ళి చేసుకుంటారా? అని చేసిన వ్యాఖ్యలు దుమారం రేపా యి. నిందితునిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాల్సి ఉండగా, పరిష్కార మార్గాలు ఏమిటన్న విమర్శలు వెల్లువెత్తాయి.


దీంతో అప్రమత్తమైన పిసిసి చీఫ్ మహేష్‌కుమార్‌గౌడ్ మంగళవారం మీడియాతో మాట్లాడుతూ మంత్రి పొన్నం వ్యాఖ్యలను ఖండించారు. మంత్రి పొన్నం వ్యాఖ్యలు పూర్తిగా వ్యక్తిగతమైనవని తెలిపారు. కుల రాజకీయాలు తీసుకుని రావడం దురదృష్టకరమన్నారు. కుల సంఘం, మధ్యవర్తిత్వం, వివాహం ద్వారా ఇలాంటి తీవ్రమైన కేసులకు పరిష్కారం కాదన్నారు. మంత్రి పొన్నం ఇటువంటి సలహా ఇవ్వడం సరైంది కాదన్నారు. మైనర్ల విషయంలో చట్టపరంగా చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. విచారణలో నిందితుని కుల, మతాలను చూడరని ఆయన అన్నారు. మైనర్ బాలికకు తాము అండగా ఉంటామని మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు.

నా మాటలను వక్రీకరించారు: పొన్నం

ఇదిలాఉండగా మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియాతో మాట్లాడుతూ బండి భగీరథ కేసులో బాధితురాలికి న్యాయం జరగాలని అన్నారు. బాధితురాలికి న్యాయం చేసే అంశమే తాను మాట్లాడితే దానిని చిలువలు-పలువలు చేసి వివాదస్పదం చేశారని, తన మాటలను వక్రీకరించారని ఆయన తెలిపారు. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రిగా ఉన్న బండి సంజయ్ తన కుమారుని విషయంలో నిర్ధోషిత్వాన్ని నిరూపించుకోవాలని మాత్రమే తాను అన్నానని ఆయన చెప్పారు. ఇందుకు మున్నూరు కాపు సంఘాలు కాంగ్రెస్ పార్టీ కక్షపూరితంగా చేస్తున్నారని అనడం భావ్యం కాదన్నారు. మీరు ఏమి చేస్తారు, పెళ్ళి చేస్తారా? అని తాను అనడంలో బాలికకు న్యాయం జరగాలన్న ఉద్దేశం అన్నారు.