
కార్మికుల సంక్షేమమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. కార్మికుల జీవన ప్రమాణాలు పెంచడమే తమ ప్రభుత్వానికి తొలి ప్రాధాన్యమని ఆయన పేర్కొన్నారు. ప్రజాభవన్‌లో భట్టి విక్రమార్క అధ్యక్షతన కనీస వేతనాల సవరణపై కేబినెట్ సబ్ కమిటీ సమావేశం సోమవారం జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. ఈ సమావేశానికి మంత్రులు, అధికారులు, ఎంపి వేం నరేందర్ రెడ్డి హాజరయ్యారు. శాస్త్రీయంగా కనీస వేతనాల సవరణ చేపడతామని భట్టి విక్రమార్క వెల్లడించారు. ఇతర రాష్ట్రాల కనీస వేతన విధానాలపై సమీక్షిస్తామని భట్టి విక్రమార్క తెలిపారు.
కేంద్ర ప్రభుత్వ లేబర్ కోడ్ ప్రభావంపై సుదీర్ఘంగా చర్చించామన్నారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు ఉండాలని కమిటీ సభ్యులు తెలిపారు. కేవలం అంకెల్లో కాదని వాస్తవ అవసరాలకు తగ్గట్టే వేతనాలు ఉండాలని చెప్పుకొచ్చారు. దేశంలో ఉత్తమ వేతన నమూనాలను తెలంగాణలో అమలు చేస్తామని భట్టి విక్రమార్క అన్నారు. కార్మికుల పక్షపాతి రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దుతామని ఆయన స్పష్టం చేశారు. అసంఘటిత, సంఘటిత రంగ కార్మికులకు లాభం చేకూరేలా చర్యలు చేపడతామన్నారు. అన్నివర్గాల అభిప్రాయాలతో త్వరలోనే తుది నిర్ణయం తీసుకుంటామని మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు.













