ముండిచింత తండాలో విషాదం నెలకొన్నది. దేవరుప్పుల మండలం ధర్మాపురం సమీపంలోని ముండిచింత తండా (లక్ష్మణ్ తండా)లో విషాదకర ఘటన చోటుచేసుకున్నది. అల్లారుముద్దుగా పెంచుకున్న కొడుకు పాముల కాటుకు గురై కళ్లముందే ప్రాణాలు కోల్పోవడంతో ఆ తండాలో విషాద ఛాయలు అలుముకున్నాయి. లక్ష్మణ్ తండాకు చెందిన శ్రీయన్ (4) అనే బాలుడు గురువారం అర్ధరాత్రి సుమారు 2 గంటల సమయంలో నిద్రలో ఉండగా ఒకే సమయంలో నాగుపాము, రక్తపింజరలు కాటువేసాయి. అయితే ఆ బాలుడు భయంతో తల్లిదండ్రులకు కాటువేసిన విషయం చెప్పలేదు. సుమారు గంట తర్వాత,

అంటే తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో తనను పాములు కరిచాయని బాలుడు చెప్పడంతో ఆందోళనకు గురైన తల్లిదండ్రులు హుటాహుటిన బాలుడిని హన్మకొండలోని ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు అత్యవసర చికిత్స అందించినప్పటికీ అప్పటికే బాలుడి శరీరం అంతటా విషం పాకింది. పరిస్థితి విషమించిన బాలుడు శుక్రవారం సాయంత్రం 4 గంటల సమయంలో మృతి చెందాడు. కళ్లముందే కొడుకు శవమై పడి ఉండటంతో తల్లిదండ్రుల రోధనలు స్థానికులను కంటతడి పెట్టించాయి. బాలుడి తల్లి కవిత ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోడు చేశారు.