ఇండియన్ ప్రీమియర్ లీగ్ 19వ సీజన్‌ కోసం జరిగిన ట్రేడింగ్ సంజు శాంసన్ రాజస్థాన్ రాయల్స్ జట్టు నుంచి చెన్నై సూపర్ కింగ్స్‌కి వచ్చిన విషయం తెలిసిందే. కొత్త జట్టులో సంజు మంచి ప్రదర్శనే చేస్తున్నాడు. ప్రస్తుతానికి 10 మ్యాచుల్లో 57.43 యావరేజ్‌తో 402 పరుగులు చేశాడు. ఇందులో రెండు సెంచరీలు, ఒక హాఫ్ సెంచరీ ఉన్నాయి. అయితే సంజు విషయంలో ఓ వార్త సోషల్‌మీడియాలో వైరల్‌ అయింది. అదేంటంటే.. సంజుకి సిఎస్‌కె కెప్టెన్సీ బాధ్యతలు అప్పగిస్తారని పుకార్లు పుట్టుకొచ్చాయి.

మరోవైపు ఐపిఎల్ వ్యాఖ్యాతలు చేసిన కొన్ని కామెంట్స్ ఈ ప్రచారానికి ఆజ్యం పోసినట్లు అయింది. మాజీ క్రికెటర్ ఆర్ అశ్విన్ కూడా సంజు కచ్చితంగా కెప్టెన్సీ చేపట్టే అవకాశాలు ఉన్నాయని వ్యాఖ్యానించడంతో ఈ ప్రచారం ఊపందుకుంది. అయితే ఈ వార్తలకు సంజు చెక్ పెట్టాడు. ఓ ప్రోమో వీడియోలో అభినవ్ ముకుంద్‌తో మాట్లాడుతూ ఈ ప్రచారానికి తెరదించాడు. తాను ఎటువంటి డిమాండ్లతో చెన్నై జట్టులో చేరలేదని తేల్చి చెప్పాడు. ‘‘కొత్త ఇంట్లోకి ప్రవేశించే సమయంలో.. ఎటువంటి డిమాండ్లతో వెళ్ల కూడదని నేర్చుకొన్నాను’’ అని సంజు వెల్లడించాడు. కాగా, నేడు చెన్నై సూపర్ కింగ్స్‌ జట్టు లక్నో సూపర్ జెయింట్స్‌తో తలపడనుంది.