మన తెలంగాణ/హైదరాబాద్‌ః ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా 2034 వరకు తానే ముఖ్యమంత్రిగా ఉంటానని, తర్వాత జాతీయ రాజకీయాల్లోకి వెళ్తానని పగటి కలలు కంటున్నారని బిజెపి నాయకులు ముప్పెట దాడి చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే.. ప్రజా సమస్యలపై అవగాహన కన్నా, పగటి కలలపై ఎక్కువ దృష్టి పెట్టినట్టుగా కనిపిస్తోందని బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు, మహబూబ్‌నగర్ లోక్‌సభ సభ్యురాలు డి.కె. అరుణ ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డి గారూ.. మీరు, మీ కాంగ్రెస్ నాయకులు ప్రజలకు ఇచ్చిన హామీలు, గ్యారంటీలు, వాగ్ధానాలు ఏం అమలు చేశారో ముందుగా చెప్పాలని ఆమె శనివారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.

ఆరు గ్యారంటీలు అంటూ అధికారంలోకి వచ్చి ఇప్పుడు ఆ హామీల అమలులో పూర్తిగా విఫలమై ప్రజలను మోసం చేసిన ప్రభుత్వం మీదని, రైతులు, నిరుద్యోగులు, మహిళలు, ఉద్యోగులు ఇలా ప్రతి వర్గం కాంగ్రెస్ పాలనపై అసంతృప్తితో ఉందని ఆమె తెలిపారు. మీ అసమర్థ పాలన, ప్రజా సమస్యలను పట్టించుకోని తీరు చూసి ప్రజలు తీవ్రంగా విసిగిపోయారని, రాష్ట్రంలో రైతుల ఇబ్బందులు, నిరుద్యోగుల ఆందోళనలు, మహిళల భద్రత సమస్యలు, పెండింగ్ హామీలు ఇవన్నీ పక్కన పెట్టి 2034 వరకు సీఎం కుర్చీ గురించి మాట్లాడటం ప్రజలను అవమానించడమేనని ఆమె విమర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కొంత అనుకూల ఫలితాలు వచ్చాయని.. వాపును చూసి బలుపు అనుకుంటున్నారు.

ప్రజల అసలు తీర్పు వచ్చే రోజులు ముందున్నాయని అప్పుడే కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎంత వ్యతిరేకత ఉందో తెలుస్తుందని ఎంపీ డికె అరుణ పేర్కొన్నారు. ఇంకా దేశ రాజకీయాల విషయానికి వస్తే రాహుల్ గాంధీ ప్రధాని అవుతారని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని, వరుసగా మూడు సార్లు దేశ ప్రజలు ఎన్డీయే ప్రభుత్వానికే భారీ మెజారిటీ ఇచ్చిన విషయాన్ని మరచిపోరాదని తెలిపారు.

కాంగ్రెస్‌ను దేశ ప్రజలు పదేపదే తిరస్కరిస్తున్నారని ఆమె పేర్కొన్నారు. ప్రతి ఎన్నికలో కాంగ్రెస్ ఓటమి చవిచూస్తున్న వాస్తవాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరిచిపోవద్దని, అసలు 2034 వరకు కాంగ్రెస్ దేశంలో ఉంటుందా? లేక పూర్తిగా పతనమవుతుందా అన్నదే ప్రశ్నగా మారిందని తెలిపారు. అలాంటి పరిస్థితిలో రాహుల్ గాంధీ ప్రధాని అవుతారని, తాను జాతీయ రాజకీయాల్లోకి వెళ్తానని చెప్పడం ప్రజలకు నవ్వు తెప్పించే వ్యాఖ్యలుగా ఉన్నాయని తెలిపారు.

రేవంత్ రెడ్డి గారూ.. ముందు తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలు నిలబెట్లుకోండి..ప్రజా సమస్యలు పరిష్కరించండి..ఆ తర్వాత భవిష్యత్ రాజకీయాల గురించి మాట్లాడితే కనీసం ప్రజలు నమ్మే పరిస్థితి ఉంటుంది&ఇప్పుడు మాత్రం మీ మాటలు ముంగేరీలాల్ కే హసీన్ సప్నేలను గుర్తు చేస్తున్నాయని ఎంపీ డికె అరుణ ఆ ప్రకటనలో విమర్శించారు.