మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో ఇంజనీరింగ్, ఫార్మా, అగ్రికల్చర్ విభాగాల్లో ప్రవేశాలకు నిర్వహించిన టిజిఇఎపిసెట్ 2026 (ఎప్‌సెట్) ఆదివారం ఉదయం 11 గంటలకు విడుదల కానున్నాయి. ప్రభుత్వ సలహాదారు కే.కేశవరావు ఎప్‌సెట్ ఫలితాలను విడుదల చేయనున్నారు. ఈ మేరకు టిజిఇఎపిసెట్ కన్వీనర్ కె.విజయకుమార్‌రెడ్డి శనివారం ఒక ప్రకటనలో విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా, సాంకేతిక విద్య కమిషనర్ శ్రీదేవసేన, ఉన్నత విద్యామండలి చైర్మన్ వి.బాలకిష్టారెడ్డి, జెఎన్‌టియుహెచ్ వైస్ ఛాన్స్‌లర్ టి.కిషన్‌కుమార్‌ రెడ్డి పాల్గొన్నారు.

ఈ నెల 4,5 తేదీలలో అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ విభాగానికి జరుగగా, ఇంజనీరింగ్ విభాగానికి ఈ నెల 9,10,11 తేదీలలో పరీక్షలు నిర్వహించారు. ఎప్‌సెట్ పరీక్షలకు ఈసారి మొత్తం 3,01,743 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా, 2,82,195 మంది హాజరయ్యారు. 93.52 శాతం హాజరు నమోదైంది. అందులో అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ విభాగానికి మొత్తం 90,977 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా, 84,954 మంది(93.38 శాతం) హాజరుకాగా, ఇంజనీరింగ్ విభాగానికి 2,10,766 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా, 1,97,241 మంది(93.58 శాతం) హాజరయ్యారు.