
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ జవాబుదారీతనంతో పని చేస్తోందని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. బిఆర్ఎస్ నేతలతో రోడ్లపై మాట్లాడించటం కాదని..సభకు వస్తే సమాధానం చెప్తామని అన్నారు. ఇందిరాపార్క్ వద్ద పిసిసి ఆధ్వర్యంలో మహాధర్నా జరిగింది. ఎమ్మెల్యే పదవికి కెసిఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. జీతభత్యాలు తీసుకుంటున్న కెసిఆర్ అసెంబ్లీకి రావట్లేదని కాంగ్రెస్ విమర్శలు చేసింది. కెసిఆర్ ప్రజాధనం ఖర్చు చేస్తూ..ప్రజలకు దూరంగా ఉంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా శ్రీధర్ బాబు మీడియాతో మాట్లాడుతూ.. పదేళ్లు సిఎంగా పనిచేసిన కెసిఆర్ సభకు వచ్చి వారి అనుభవాన్ని పంచుకోవాలని, విపక్షలు సోషల్ మీడియాలో చేస్తున్న విషప్రచారాలను తిప్పి కొట్టాలని సూచించారు. ఆర్టిసి బస్సుల్లో కాంగ్రెస్ కార్యకర్తలు మాత్రమే ఉచిత ప్రయాణం చేస్తున్నారా? అని ప్రశ్నించారు. పేదలకు ఇళ్లకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తున్నామని, రాష్ట్రంలో పేదలకు రేషన్ కార్డు కూడా దౌర్భాగ్య పాలన పదేళ్ల పాటు సాగిందని మండిపడ్డారు.
బిఆర్ఎస్ నాయకుడి వైఖరి మారకుంటే.. మరో పదేళ్లు కూడా వాళ్లు రోడ్ల మీద ఉంటారని హెచ్చరించారు. ఇప్పుడు బిఆర్ఎస్ నేతలు డిమాండ్ చేస్తున్న అంశాలను పదేళ్లపాటు ఎందుకు అమలు చేయలేదు? అని, బిఆర్ఎస్, బిజెపి కార్యకర్తలకు రేషన్ కార్డు రాలేదా? అని.. సన్న బియ్యం తీసుకోవట్లేదా? అని ప్రశ్నించారు. రెండున్నరేళ్లలోనే రైతుల ఖాతాల్లో రూ.1.60 లక్షల కోట్లు జమచేశామని, మళ్లీ ఎన్నికలకు వెళ్లేలోపు..ఆరు గ్యారెంటీలను సంపూర్ణంగా అమలు చేస్తామని హామీ ఇచ్చారు. రూ. 8 లక్షల కోట్ల అప్పు ఉన్న రాష్ట్రాన్ని కెసిఆర్ తమకు అప్పగించారని, రూ.8 లక్షల కోట్ల అప్పుపై అసలు, వడ్డీ చెల్లిస్తూ..సంక్షేమం కూడా అమలు చేస్తున్నామని, బిఆర్ఎస్ పదేళ్ల పాలనలో ఒక్కసారి కూడా గ్రూప్-1 నియమకాలు జరగలేదని శ్రీధర్ బాబు ధ్వజమెత్తారు.













