
మన తెలంగాణ/ కోదాడ: హైదరాబాద్ నుంచి బుధవారం తెల్లవారుజామున ఏలూరుకు 42 మంది ప్రయాణికులతో బయలుదేరిన ట్రావెల్స్ బస్సు కోదాడ సమీపంలో దోరకుంట వద్ద జాతీ య రహదారిపై డివైడర్‌పైకెక్కి నిలిచిన కంటైనర్‌ను వెనుక నుం చి ఢీకొట్టడంతో అక్కడికక్కడే ఆరుగురు దుర్మరణం చెందారు. నలుగురి పరిస్థితి విషయంగా ఉంది. 11 మందికి తీవ్రగాయాలయ్యా యి. మృతుల్లో ఎన్టీఆర్ జిల్లా వం గుటూరు మండలం తేలప్రోలు గ్రామానికి చెందిన యాసారపు చిన్ని(32), విజయవాడకు చెందిన బొల్లిపోగు మేరీ జ్యోత్స(29), కృష్ణాజిల్లా పామిడిముక్కల మండలం పడమట లంకపల్లికి చెందిన చెన్నకేశవుల నాగేంద్రబాబు(21),వెస్ట్ గోదావరి జిల్లా భీమవరం మండలం మంటి వారే తోటకు చెందిన సురవరపు షకీనా, విజయవాడకు చెందిన పిడికిటి లక్ష్మి, విజయవాడకు చెందిన కొందూరు భావన ఉన్నారు.
తెల్లవారుజామున 4 గంటలకు డివైడర్‌పైకెక్కి నిలిచిన కంటైనర్‌ను బస్సు వెనుక నుంచి ఢీకొట్టింది. కంటైనర్‌లో ఉన్న ఇనుప స్తంభాలు బస్సులోకి చొచ్చుకువచ్చాయి. నిద్రమత్తులో ఉన్న ప్రయాణికుల తలలపై పడడంతో ఆరుగురు మృతి చెందారు. ప్రమాద విషయాన్ని తెలుసుకున్న వెంటనే సూర్యాపేట కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్, జిల్లా ఎస్పీ నరసింహ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. గాయపడిన వారిని కోదాడ ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. తీవ్రంగా గాయపడిన వారిని మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్,- విజయవాడలకు తరలించారు. కోదా డ రూరల్ పోలీసులు పోస్టుమార్టం అనంతరం మృతదేహాలకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక వాహనాల్లో వారి స్వస్థలాలకు తరలించారు. రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
సిఎం రేవంత్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి
ఘటనపై సీఎం రేవంత్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని సీఎస్‌ను ఆదేశించారు.
ప్రభుత్వపరంగా సహాయం: మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
దుర్ఘటనపై పౌర సరఫరాల మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ప్రభుత్వ పరంగా సహాయం అందిస్తామన్నారు. ప్రమాద ఘటన కలిచివేసిందని కోదాడ ఎమ్మెల్యే పద్మావతిరెడ్డి అన్నారు. గాయపడ్డవారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని స్థానిక అధికారులను ఆదేశించారు.
ఏపీ సిఎం చంద్రబాబు, డిప్యూటీ సిఎం పవన్ కల్యాణ్ సానుభూతి
ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులకు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు. సహాయక చర్యలకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వంతో సమన్వయం చేసుకోవాలని అధికారులను ఆదేశించారు.








