బ్రిటన్‌కు చెందిన రోగికి విజయవంతంగా శస్త్రచికిత్స

మెదడులోని కణితి తొలగింపు

ఆపరేషన్ వీడియోను ప్రత్యక్షంగా విశ్లేషించి వైద్యులకు సూచనలు చేసిన ఎఐ

లండన్ : కృత్రిమ మేధ సాంకేతిక రంగంలోనే కాదు వైద్య రంగంలోనూ తన సత్తా చాటుతోంది. ప్రపంచంలోనే తొలిసారిగా కృత్రిమ మేధస్సు సహాయంతో మెదడు శస్త్రచికిత్స విజయవంతమైంది. రోగి విజయవంతంగా కోలుకుంటున్నారు. శస్త్రచికిత్సలో భాగంగా రోగి మెదడులోని కణితిని వైద్యులు విజయవంతంగా తొలగించారు. బ్రిటన్‌లోని బెడ్‌ఫోర్డ్‌షైర్‌కు చెందిన రైస్ హిబర్ట్ (48)కు ఈ ఆపరేషన్ నిర్వహించారు.

ఈ శస్త్రచికిత్స జరగకపోయి ఉంటే ఆయన చూపును కోల్పోయే ప్రమాదం ఉండేదని యూనివర్సిటీ కాలేజ్ లండన్ హాస్పిటల్ వైద్యులు తెలిపారు. శస్త్రచికిత్స జరుగుతున్న సమయంలో ఏఐ సాధనం ఆపరేషన్ వీడియోను ప్రత్యక్షంగా విశ్లేషించింది. మెదడులో కనిపించకుండా ఉన్న కీలకమైన రక్తనాళాలు, నరాలకు దెబ్బతగలకుండా ఉండేందుకు శస్త్రచికిత్స చేస్తున్న వైద్యులకు ఎప్పటికప్పుడు సూచనలు చేసింది. దీంతో కణితిలో సాధ్యమైనంత ఎక్కువ భాగాన్ని సురక్షితంగా తొలగించేందుకు వైద్యులకు వీలైంది.

రోగి భద్రత పరంగా చూస్తే ఏఐ ప్రయోజనం స్పష్టంగా కనిపిస్తోంది. మన తల లోపల రహదారి సూచికలు (రోడ్ సైన్లు) ఏమీ ఉండవు కదా అని హిబర్ట్ పేర్కొన్నారు. సుమారు 18 నెలల క్రితం వరకు హిబర్ట్ పూర్తి ఆరోగ్యంగా ఉండేవారు. కస్టమర్ సర్వీసెస్ మేనేజర్‌గా పనిచేసే ఆయన ప్రతిరోజూ మధ్యాహ్న భోజన విరామ సమయంలో సుమారు రెండు మైళ్ల దూరం నడిచేవారు. అలాంటిది ఓ రోజు నడకకు వెళ్లిన సమయంలో రోడ్డుపైనే ఒక్కసారిగా స్పృహ కోల్పోయి, మూర్ఛకు గురయ్యారు. వైద్యులు నిర్వహించిన పరీక్షల్లో 11 మిల్లీ మీటర్ల పరిమాణంలో క్యాన్సర్ రహిత కణితి ఉన్నట్లు గుర్తించారు. ఈ కణితి పిట్యూటరీ గ్రంథి (పీయూష గ్రంథి)పై పెరుగుతున్నట్లు గుర్తించారు.

పుర్రె అడుగుభాగంలో ఉండే ఈ గ్రంథి పరిమాణం దాదాపు ఒక గోలీ సైజులో ఉన్నప్పటికీ, శరీరానికి అత్యంత కీలకమైన హార్మోన్లను విడుదల చేస్తుంది. ఎదుగుదల, జీవక్రియ (మెటబాలిజం), రక్తపోటు, శరీర ఉష్ణోగ్రత నియంత్రణ వంటి అనేక ప్రక్రియల్లో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి. అయితే పిట్యూటరీ గ్రంథి మెదడుకు రక్తాన్ని సరఫరా చేసే అత్యంత కీలకమైన కరోటిడ్ ధమనులు, అలాగే చూపును నియంత్రించే ఆప్టిక్ నరాలకు అత్యంత సమీపంలో ఉంటుంది. హిబర్ట్‌కు ఉన్న కణితి క్రమంగా ఆప్టిక్ నరాలపై ఒత్తిడి పెంచడంతో ఆయన పెరిఫెరల్ విజన్ క్రమంగా తగ్గిపోయింది. ఈ నేపథ్యంలో శస్త్రచికిత్సలో కణితిని తొలగించడంతో పాటు, కీలకమైన రక్తనాళాలు, నరాలకు ఎలాంటి నష్టం కలగకుండా చూడటంలో ప్రత్యక్ష ఏఐ సహాయం వైద్యులకు కీలకంగా సహాయ పడింది. ఈ ఏడాది మే నెలలోనే శస్త్రచికిత్స నిర్వహించినా దానిని అప్పుడే బయటపెట్టలేదు. రోగి పూర్తిగా కోలుకున్న తర్వాత తాజాగా దానికి బయటి ప్రపంచానికి వెల్లడించారు.