అమరావతి: తన భర్తను సాయికిరణ్ అనే వ్యక్తి మరో ముగ్గురుతో కలిసి హత్య చేశాడని, కానీ హత్య వెనుక కటౌట్ శ్రీను ఉన్నాడని మృతుడు జిమ్ ట్రైనర్ సతీష్ రెడ్డి(30) భార్య జయశ్రీ ఆరోపణలు చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాకినాడలో బుధవారం తెల్లవారుజామును సతీష్ రెడ్డి నడిరోడ్డుపై కత్తులతో పొడిచి చంపిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా జయశ్రీ మీడియాతో మాట్లాడారు. కటౌట్ శ్రీను భార్యతో సతీష్ రెడ్డి స్నేహం ఉందని, దీంతో కటౌట్ శ్రీను, అతడి భార్య విడిపోయారని, ఆమెతో సాయి కిరణ్ అసభ్యంగా ప్రవర్తించడంతో తన భర్త అతడిని మందలించాడన్నారు. సాయి కిరణ్ తన భర్తపై పగ పెంచుకోవడంతో విడాకులకు సతీష్ రెడ్డి కారణమని తన భర్తను చంపుతానని కటౌట్ శ్రీను తన ఇంటికి వచ్చి హెచ్చరించాడన్నారు. శ్రీను ప్లాన్‌లో భాగంగా సాయి కిరణ్ తన ముగ్గురు స్నేహితులతో కలిసి తన భర్తను నడి రోడ్డుపై చెక్క ముక్కలను గొంతులో కుచ్చి చంపేశారని ఆరోపణలు చేశారు. వాహనాదారులు చూస్తు ఉండిపోయారని, ఒక్కరు కూడా ఆపలేదన్నారు. పోస్టు మార్టమ్ దగ్గరికి వెళ్లినప్పుడు పోలీసులు తనని ప్రశ్నించినప్పుడు కటౌట్ శ్రీను పేరు చెప్పానని, తనని పోలీసులు చెప్పొదంటూ ఆపారని ఆరోపణలు చేసింది. ఒక ఎంఎల్‌ఎకు కటౌట్ శ్రీను ప్రధాన అనుచరుడిగా ఉండడంతో అతడి పేరు పోలీసులు చెప్పనివ్వడంలేదని జయశ్రీ ఆరోపణలు చేసింది. ఇప్పటికైనా, ఉన్నాతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని జయశ్రీ డిమాండ్ చేస్తున్నారు.