
ప్రస్తుత కాలంలో ఉద్యోగాలకోసం వలసలు, పిల్లల చదువులు, వ్యక్తిగత స్వేచ్ఛ కోరుకోవడం వల్ల ఉమ్మడి కుటుంబాల సంఖ్య తగ్గి, ఏక కుటుంబాలు పెరుగుతున్నాయి. భారతీయ సంస్కృతిలో ఉమ్మడి కుటుంబ వ్యవస్థకు ఎంతో ప్రాధాన్యం ఉంది. ఒకే ఇంట్లో తాతలు, అమ్మమ్మలు, తల్లిదండ్రులు, పిల్లలు, అన్నదమ్ములు కలిసి జీవించడం ఉమ్మడి కుటుంబం అని అంటారు. ఈ కుటుంబ వ్యవస్థ ప్రేమ, అనురాగం, పరస్పర సహకారం, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచేది. అంతర్జాతీయ కుటుంబ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం మే 15వ తేదిన ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు. కుటుంబ వ్యవస్థ ప్రాముఖ్యతను తెలియజేయడం, కుటుంబ బంధాలను బలోపేతం చేయడం, సమాజ నిర్మాణంలో కుటుంబాల పాత్రను గుర్తించడం ఈ దినోత్సవం ప్రధాన ఉద్దేశం. ఈ దినోత్సవాన్ని యునైటెడ్ నేషన్స్ 1993లో ప్రకటించింది.
అప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఒక ప్రత్యేక అంశంతో ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. కుటుంబ సంక్షేమమే పిల్లల అభివృద్ధికి మార్గం అనే అంశాన్ని దృష్టిలో ఉంచుకొని 2026లో కుటుంబాలు, అసమానతలు, బాలల శ్రేయస్సు అనే థీమ్‌తో పనిచేస్తుంది. పూర్వకాలం నుండి భారతదేశంలో ఉమ్మడి కుటుంబాలు సమాజానికి బలమైన పునాదిగా ఉండేవి. కానీ నేటి ఆధునిక జీవనశైలిలో ఉద్యోగాలు, విద్య, నగర జీవనం వంటి కారణాల వల్ల చిన్న కుటుంబాలు పెరుగుతున్నాయి. అయినప్పటికీ ఉమ్మడి కుటుంబాల విలువలు ఇంకా సమాజంలో నిలిచి ఉన్నాయి. పండుగలు, శుభకార్యాల సమయంలో కుటుంబ సభ్యులంతా కలుసుకోవడం ఆనందాన్ని ఇచ్చేది. ఉమ్మడి కుటుంబాల్లో పిల్లలకు తాతలు, అమ్మమ్మల, నానమ్మల ప్రేమ, అనుభవం పొండేవారు. వారు కథలు చెప్పడం, మంచి మాటలు నేర్పించడం ద్వారా పిల్లల్లో నీతి, వినయం, గౌరవ భావాలు పెంపొందిస్తారు.
పెద్దల అనుభవం పిల్లల జీవితానికి మార్గదర్శకంగా ఉండేది. ఉమ్మడి కుటుంబాల్లో పిల్లలు పరస్పర గౌరవం, సహనం, సహకారం వంటి విలువలను నేర్చుకుంటారు. అందరితో కలిసి ఉండటం వల్ల పంచుకోవడం అనే గుణం పెరుగుతుంది. పెద్దలను గౌరవించడం, చిన్నవారిని ప్రేమించడం వంటి మంచి అలవాట్లు అలవాడుతాయి. పిల్లల చదువు, ప్రవర్తనపై కుటుంబ సభ్యులందరూ శ్రద్ధ చూపుతారు. తల్లిదండ్రులు పనుల్లో బిజీగా ఉన్నప్పటికీ ఇతర పెద్దలు పిల్లలను గమనిస్తూ సరైన మార్గంలో నడిపిస్తారు. దీనివల్ల పిల్లల్లో క్రమశిక్షణ పెరుగుతుంది. చాలామందితో కలిసి జీవించడం వల్ల పిల్లల్లో మాట్లాడే తీరు, ఇతరులను అర్థం చేసుకునే గుణం, సహనం వంటి సామాజిక నైపుణ్యాలు అభివృద్ధి చెందుతాయి. సమాజంలో ఎలా మెలగాలో వారు చిన్నప్పటి నుంచే నేర్చుకుంటారు. ఉమ్మడి కుటుంబంలో పిల్లలు ఒంటరితనాన్ని అనుభవించరు.
కుటుంబ సభ్యులందరి ప్రేమ, ఆదరణవల్ల వారికి భావోద్వేగ భద్రత కలుగుతుంది. సమస్యలు వచ్చినప్పుడు వారికి మద్దతుగా నిలిచే వారు ఎక్కువగా ఉంటారు. తద్వార నేటి యువత క్షణికావేశంలో తీసుకొన్నా నిర్ణయాలను అరికట్టి, ఆత్మహత్యలు నివారించవచ్చు. కుటుంబ సభ్యులు ఒకరికొకరు అండగా నిలుస్తారు. పెద్దల ద్వారా పిల్లలకు మంచి విలువలు, సంప్రదాయాలు తెలుస్తాయి. ఒంటరితనం తగ్గి కుటుంబ సభ్యుల మధ్య అనుబంధం పెరుగుతుంది. కుటుంబ సభ్యుల మధ్య చిన్నచిన్న అభిప్రాయ భేదాలు సహజం. కానీ పిల్లల ముందు వాదనలు, గొడవలు జరగకుండా చూసుకోవాలి. ఇవి పిల్లల మనసుపై ప్రతికూల ప్రభావం చూపవచ్చు. ఉమ్మడి కుటుంబాల్లో పిల్లలకు ఎక్కువ ప్రేమ, గారాబం లభిస్తుంది.
కానీ అది అతిగా మారితే పిల్లల్లో మొండితనం లేదా బాధ్యతారాహిత్యం పెరగవచ్చు. ప్రేమతో పాటు క్రమశిక్షణ కూడా అవసరం. కుటుంబంలో సభ్యులు ఎక్కువగా ఉన్నప్పటికీ ప్రతి పిల్లవాడి అవసరాలు, ఆసక్తులు, భావోద్వేగాలను గుర్తించి ప్రత్యేక శ్రద్ధ చూపాలి. నేటి కాలంలో చిన్న కుటుంబాలు పెరిగినా, అలనాటి ఉమ్మడి కుటుంబాల జ్ఞాపకాలు ప్రతి మనసులో మధుర స్మృతులుగా నిలిచిపోయాయి. ఆ అనుబంధాలు, ఆ ఆప్యాయతలు, ఆ కుటుంబ విలువలు ఎప్పటికీ మరువలేనివి. ఉదయం పెద్దల ఆశీర్వాదాలతో రోజు ప్రారంభమయ్యేది. అమ్మమ్మ చెప్పే కథలు, తాతయ్య చెప్పే నీతిమంతమైన మాటలు పిల్లల మనసుల్లో మంచి విలువలను నాటేవి. ఉమ్మడి కుటుంబాలు మన సంస్కృతి, సంప్రదాయాలకు మూలస్తంభాలు. ప్రేమ, భద్రత, సహకారం, విలువలతో కూడిన జీవన విధానాన్ని ఉమ్మడి కుటుంబాలు అందిస్తాయి. అందువల్ల నేటి సమాజంలో కూడా ఉమ్మడి కుటుంబాల ప్రాధాన్యత ఎంతో అవసరం. అందుకే బలమైన కుటుంబం - బలమైన సమాజానికి పునాది అని అన్నారు పెద్దలు.
-మోటె చిరంజీవి, 99491 94327
- (నేడు అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం)














