
మన తెలంగాణ/హైదరాబాద్: ప్రజలు కొనుగోలు చేసిన భూములు పొరపాటున 22 ఏ (నిషేధిత జాబితాలో) ఉంటే ఆ భూమిని వారికే ఇప్పిస్తాన ని సిఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. ఈ విషయంలో నాదీ పూచీ అని, సమస్య ఉన్న ఒక సర్వేనెంబర్లో 500 ఎకరాలు ఉంటే అన్ని నిషేధిత జాబితాలో పెట్టారని, వాటికి సబ్ నెంబర్ ఇచ్చి సమస్యను పరిష్కరిస్తామని సిఎం రేవంత్‌రెడ్డి హామీనిచ్చారు. 22-ఏ నిషేధిత జాబితాలో ఉన్న భూముల గు రించి రైతులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, మీ భూమి మీకు ఇప్పిస్తానని సిఎం హామీ ఇచ్చారు. సోషల్ మీడియా అబద్ధాలను నమ్మవద్దని సిఎం ధైర్యం చెప్పారు. కూకట్‌పల్లిలో ఇందిరమ్మ ఇళ్ల టవర్స్ శంకుస్థాపన సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిఎం రేవంత్ రెడ్డి ప్రతిపక్షాల పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
గత పదేళ్లు అధికారంలో ఉన్న వాళ్లు రాష్ట్రానికి కరువు రావాలని కర్ణాటక వెళ్లి చేతబడి పూజలు చేశారని రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. చేతబడి చేస్తే అది తిరగబడి మళ్లీ ఫాంహౌస్ నుంచి బయటకు రాకుండా అష్టదిగ్బంధం చేసిందని సిఎం ఆరోపించారు. రాష్ట్రంలో కరువు రావాలని కొంతమంది క్షుద్ర పూజలు చేసినా, దేవుడి దయతో వర్షాలు సమృద్ధిగా కురిశాయని చెప్పారు. మంచి మనసుతో చేసే పనికి దేవుడి ఆశీస్సులు ఉంటాయని, కుటిల బుద్ధి ఉన్నవారికి ఆ పూజలే తిరిగి చుట్టుకుంటాయని సిఎం వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వ అప్పులు తీరుస్తూనే సంక్షేమాన్ని పరుగెత్తిస్తున్నామని రేవంత్ రెడ్డి అన్నారు.
మహిళా సంఘాలకు రూ.65 వేల కోట్ల రుణాలు
తాము అధికారంలోకి వచ్చాక రోజుకు 18 గంటలు కష్టపడుతూ, గత ప్రభుత్వం మిగిల్చిన అప్పులు కడుతున్నామని చెప్పారు. గతంలో దొడ్డు బియ్యం ఇస్తే బర్రెలకు దానాగా వేసేవారని, కానీ, తాము అధికారంలోకి రాగానే సన్నబియ్యం అందించి పేదల కడుపు నింపుతున్నామని సిఎం తెలిపారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత కరెంట్, 500 రూపాయలకే సిలిండర్, మహిళా సంఘాలకు రూ.65 వేల కోట్ల రుణాలు అందించామని సిఎం గుర్తుచేశారు. మహిళలను బస్సులకు యజమానులుగా, పెట్రోల్ బంకులు, సోలార్ ప్లాంట్ల నిర్వాహకులుగా తీర్చిదిద్దుతున్నామని సిఎం తెలిపారు. శిల్పారామంలో స్టాళ్లు కేటాయించామని సిఎం రేవంత్ పేర్కొన్నారు. రాష్ట్రంలో విధ్వంసకర రాజకీయాలను పక్కనపెట్టి తమ ప్రభుత్వం రాష్ట్రాన్ని వికాసం వైపు నడిపిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు.
గత ప్రభుత్వం ఇచ్చిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఎక్కడ ఉన్నాయో చెప్పాలి
గత ప్రభుత్వం ఇచ్చిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఎక్కడ ఉన్నాయో చెప్పాలని సిఎం రేవంత్‌రెడ్డి సవాల్ విసిరారు. ఇప్పుడు తాము క్యూర్ పరిధిలో తొలి విడతగా లక్ష ఇళ్లు, పేదల కోసం అద్భుతమైన ఎల్ఐజీ టవర్లను నిర్మిస్తున్నామని సిఎం తెలిపారు. ఈ బృహత్తర కార్యక్రమం చేపట్టిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని ముఖ్యమంత్రి అభినందించారు. రెండేళ్లలో 70 వేల ఉద్యోగాలు ఇచ్చామని, ప్రతి పేదవాడి సొంతింటి కల నెరవేర్చే వరకు నిద్రపోబోమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
పదేళ్ల పాలనను, రెండేళ్ల పాలనతో బేరీజు వేసుకోవాలి
ఆనాడు తాను ఎంపిగా పోటీ చేసినప్పుడు కూకట్పల్లి ప్రజలు నన్ను ఆశీర్వదించి గల్లీ నుంచి ఢిల్లీకి పంపారని సిఎం గుర్తు చేసుకున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నిధుల కొరత వల్ల ఆశించిన స్థాయిలో అభివృద్ధి చేయలేకపోయానని, కానీ, ఇప్పుడు ప్రజా ప్రభుత్వంలో కూకట్‌పల్లిని సమగ్రంగా అభివృద్ధి చేసే అధికారం, అవకాశం పూర్తిగా మన చేతుల్లోనే ఉందని సిఎం స్పష్టం చేశారు. నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి సారించి, అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని మంత్రి శ్రీధర్ బాబును ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు. గత పదేళ్ల పాలనను, తమ రెండేళ్ల పాలనతో బేరీజు వేసుకోవాలని సిఎం ప్రజలకు సూచించారు.








