
టీం ఇండియా మాజీ క్రికెటర్ వివిఎస్ లక్ష్మణ్ ప్రస్తుతం సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌కు అధిపతిగా ఉన్నారు. అయితే ఆయనకు మరింత పెద్ద బాధ్యతలు అప్పగించాలని బిసిసిఐ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ తన పదవిని పొడిగించుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి. సెప్టెంబర్‌లో భారత క్రికెట్ బోర్డు సర్వసభ్య సమావేశం జరుగనుంది. ఈ సమావేశంలోనే కీలక నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉంది. తొలుత లక్ష్మణ్‌కు ప్రధాన కోచ్ లేదా చీఫ్ సెలక్టర్ పదవి ఇస్తారనే ప్రచారం జరిగింది. బిసిసిఐ తదుపరి అధ్యక్షుడిగా చేస్తారనే ఊహాగానాలు వచ్చాయి. కానీ, లక్ష్మణ్‌ను బిసిసిఐ డైరెక్టర్ ఆఫ్ క్రికెట్‌గా నియమిస్తారని క్రీడా వర్గాలు పేర్కొంటున్నాయి.
డైరక్టర్ ఆఫ్ క్రికెట్ అంటే దేశవ్యాప్తంగా క్రికెట్ నిర్వహణకు సంబంధించి కీలక బాధ్యతలను పర్యవేక్షించాలి. సీనియర్ జట్టు, సెలక్టర్లు, కోచ్‌లు, సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్, వివిధ దశల్లోని క్రికెటర్లతో నిరంతరం సంప్రదింపులు జరపాలి. ప్రతిభను గుర్తించడం, క్రీడాకారుల వృద్ధికి సహకరించడం, వారి నుంచి అత్యుత్తమ ప్రదర్శన వచ్చేలా ప్రోత్సహించేందుకు అవసరమైన ప్రణాళికలను సిద్ధం చేయడం వంటి కార్యకలాపాలను నిర్వహించాల్సి ఉంటుంది. ప్రస్తుతం సివొఇలో ఇప్పటికే ఇలాంటి బాధ్యతల్లోనే లక్ష్మణ్ ఉన్నారు.
ప్రస్తుత చీఫ్ సెలక్టర్‌గా ఉన్న అజిత్ అగార్కర్ పదవీకాలం సెప్టెంబర్‌లోనే ముగియనుంది. వచ్చే ఏడాది వన్డే ప్రపంచకప్ జరుగనుంది. ఇలాంటి సమయంలో సెలక్షన్ కమిటీలో మార్పులు చేయడం కంటే కొనసాగించడమే మేలనే ఉద్దేశంలో బిసిసిఐ ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే, వార్షిక సమావేశంలో అగార్కర్ పదవీకాలాన్ని వచ్చే ఏడాది జూన్ వరకూ పొడిగించాలని భావిస్తోంది. అలాగే లక్ష్మన్ను డైరక్టర్‌గా తీసుకుంటే.. సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ హెడ్ బాధ్యతలను మరొకరికి అప్పగించాలి. మరి ఎవరిని ఎంపి చేస్తారనేది ఆసక్తికరమే








