
మన తెలంగాణ/హైదరాబాద్: ధాన్యం, మొక్కజొన్న పంట కొనుగోళ్లపై నిర్లక్ష్యం వహిస్తే అధికారులపై వెంటనే చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సంబంధిత అధికారులను హెచ్చరించారు. కొనుగోళ్ల వ్యవహారంపై జిల్లా కలెక్టర్లు పూర్తి బాధ్యత తీసుకోవాలని సిఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. జిల్లా కలెక్టర్లు మిషన్ మోడ్‌లో పని చేయాలని, క్షేత్రస్థాయిలో పర్యటించాలని సిఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి పత్రికల్లో వచ్చే ప్రతికూల వార్తలకు జిల్లా కలెక్టర్లు వెంటనే స్పందించి పరిష్కరించాలని సిఎం ఆదేశించారు. ప్రతిరోజు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి కొనుగోళ్ల పురోగతిని కలెక్టర్‌లు సమీక్షించాలని ఆయన సూచించారు.
కొనుగోళ్ల అంశాన్ని తేలికగా తీసుకునే అధికారుల పై వెంటనే చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హెచ్చరించారు. మంగళవారం మొక్కజొన్న, ధాన్యం కొనుగోళ్ల పై సిఎం రేవంత్ రెడ్డి, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, వాకిటి శ్రీహరి, దనసరి అనసూయ (సీతక్క), అడ్లూరి లక్ష్మణ్ కుమార్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావుతో కలిసి అన్ని జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సిఎం రేవంత్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌ను కరీంనగర్ కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా, అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి హాజరయ్యారు.'
రైస్ మిల్లుల వద్ద ఎలాంటి కోతలు ఉండకూడదు
ఈ సందర్భంగా సిఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ మొక్కజొన్న, ధాన్యం కొనుగోళ్లలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జిల్లా యంత్రాంగం సమన్వయంతో పని చేయాలని జిల్లా కలెక్టర్లను సిఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. జిల్లాలో ఉన్న ప్రతి ప్రైవేట్ గోదాంను అవసరమైతే ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకోవాలని, అవసరమైన అన్ని చట్టాలను వినియోగించి నిల్వ సదుపాయాలను పెంచాలని సిఎం రేవంత్‌రెడ్డి సూచించారు. కమ్యూనిటీ హాళ్లు, రైతు బజార్లను తాత్కాలిక షెడ్లుగా వినియోగించాలని ఆయన ఆదేశించారు. జిల్లా ఎస్పీలు, ఉన్నత స్థాయి పోలీసు అధికారులు కొనుగోళ్ల ప్రక్రియలో చురుకుగా పాల్గొనాలని, అవసరమైన వాహనాల ఏర్పాట్లు వెంటనే పూర్తి చేయాలని సిఎం రేవంత్‌రెడ్డి సూచించారు. జిల్లాల్లో స్థానిక హమాలీలను 100 శాతం వినియోగించుకునేలా కార్యాచరణ రూపొందించాలని, ఎక్కడా హమాలీల కొరత రాకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. అవసరమైన పోలీసు సహకారం తీసుకోవాలని ఆయన స్పష్టం చేశారు. కొన్ని చోట్ల ధాన్యం రైస్ మిల్లులకు చేరిన తర్వాత రైతులకు రశీదులు ఇస్తుండటంతో కోతలు జరుగుతున్నాయని, ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ జరగకూడదని సిఎం స్పష్టం చేశారు. కొనుగోలు కేంద్రాల్లోనే నాణ్యత పరిశీలన అనంతరం రైతులకు వెంటనే రశీదులు ఇవ్వాలని, రైస్ మిల్లుల వద్ద ఎలాంటి కోతలు ఉండకూడదని ఆదేశించారు.
పంట రవాణా కోసం వాహనాలు, ట్రాక్టర్లు, డిసిఎంలను పూర్తిస్థాయిలో వినియోగించాలి
పంట రవాణా కోసం ఖాళీగా ఉన్న అన్ని వాహనాలు, ట్రాక్టర్లు, డిసిఎంలను పూర్తిస్థాయిలో వినియోగించాలని అధికారులను సిఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల వద్ద టార్పాలిన్ కవర్లు సిద్ధంగా ఉంచాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సూచించారు. తడిసిన ధాన్యం కొనుగోళ్లకు అవసరమైన ఏర్పాట్లు చేయాలన్నారు. ప్రతి రైస్ మిల్లుకు కొనుగోళ్ల పర్యవేక్షణ కోసం సమర్థవంతమైన అధికారిని నియమించాలని, ఆయా అధికారులు ప్రతి రోజూ నివేదికలు పంపించాలని సిఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. ప్రతిరోజూ వివిధ సమస్యలపై రైతులు రోడ్డెక్కే పరిస్థితి రాకూడదని, రవాణా కోసం నిబంధనల ప్రకారం వాహనాలు ఇవ్వని ట్రాన్స్‌ఫోర్ట్ కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలని సిఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు.
25 లక్షల 78 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు: మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి
పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఈ యాసంగి సీజన్‌లో రాష్ట్ర ప్రభుత్వం రికార్డు స్థాయిలో 90 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యంగా నిర్ణయించిందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం కేవలం 52 లక్షల మెట్రిక్ టన్నుల లక్ష్యాన్ని మాత్రమే నిర్దేశించిందన్నారు. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 8,575 ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా 25 లక్షల 78 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు మంత్రి ఉత్తమ్ తెలిపారు. ప్రస్తుతం కొనుగోలు కేంద్రాల వద్ద 11 లక్షల 52 వేల టన్నుల ధాన్యం పెండింగ్లో ఉందన్నారు. రైతులకు కనీస మద్దతు ధర చెల్లింపుల కోసం ఇప్పటివరకు రూ. 3,873 కోట్లను బ్యాంకుల ద్వారా విడుదల చేసినట్లు మంత్రి తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 18 కోట్ల 68 లక్షల గన్నీ సంచులను అందుబాటులో ఉంచామని, ఎటువంటి కొరత లేదని స్పష్టం చేశారు.
జిల్లా కలెక్టర్లు హమాలీలు, రవాణా సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఆదేశించారు. క్షేత్రస్థాయిలో ఎలాంటి సమస్యలు ఉన్నా వెంటనే ఫీడ్బ్యాక్ అందేలా వ్యవస్థ ఉండాలని సూచించారు. ధాన్యం కొనుగోళ్లపై జిల్లా కలెక్టర్లు పూర్తి బాధ్యత తీసుకోవాలని మంత్రి స్పష్టం చేశారు. కొనుగోలు కేంద్రాల వద్ద గన్నీ సంచులు, హమాలీలు, రవాణా వాహనాల కొరత లేకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రైతులకు చెల్లింపులు వేగంగా జరిగేలా ట్యాబ్ ఎంట్రీలు వెంటనే పూర్తి చేయాలని సూచించారు.
అవసరమైన బందోబస్తు, విజిలెన్స్ ఏర్పాటు చేయాలి: మంత్రి తుమ్మల
వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ యాసంగి సీజన్‌లో భారీగా మొక్కజొన్న దిగుబడి వచ్చిందని, రైతులు ఇబ్బందులు పడకుండా కొనుగోళ్లు సజావుగా నిర్వహించాలని మంత్రి తుమ్మల పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి ధాన్యం, మొక్కజొన్న తెలంగాణలోకి రాకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి తుమ్మల ఆదేశించారు. అవసరమైన బందోబస్తు, విజిలెన్స్ ఏర్పాటు చేయాలని మంత్రి సూచించారు. వర్షాల సూచనల పై ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తూ కొనుగోళ్ల వేగాన్ని పెంచాలని అధికారులను మంత్రి ఆదేశించారు.
మొక్కజొన్న కొనుగోళ్లకు మంత్రివర్గం రూ. 4,178 కోట్లకు ఆమోదం: సిఎస్
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు మాట్లాడుతూ రాష్ట్రంలో పెద్ద ఎత్తున మొక్కజొన్న కొనుగోళ్లు జరుగుతున్నాయని ఆయన తెలిపారు. రాబోయే ఒక నెల అత్యంత కీలకమని, రైతులకు ఎలాంటి నష్టం కలగకుండా చర్యలు తీసుకోవాలని సిఎస్ సూచించారు. యాసంగి సీజన్‌లో రాష్ట్రవ్యాప్తంగా 16 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న సాగు జరగడంతో ఎకరానికి సగటున 25 క్వింటాళ్ల దిగుబడి వచ్చిందన్నారు. మొక్కజొన్న కొనుగోళ్ల కోసం రాష్ట్ర మంత్రివర్గం రూ. 4,178 కోట్లను ఆమోదించిందని ఆయన తెలిపారు. ఇప్పటి వరకు ప్రభుత్వం ద్వారా 8 లక్షల మెట్రిక్ టన్నుల మొక్కజొన్న కొనుగోళ్లు జరగ్గా, ప్రభుత్వం కొనుగోళ్లు ప్రారంభించిన తర్వాత ప్రైవేటు వ్యాపారులు కూడా అధిక ధరలకు మరో 6 లక్షల టన్నులు కొనుగోలు చేసినట్లు ఆయన తెలిపారు. మొత్తం 14 లక్షల 90 వేల మెట్రిక్ టన్నుల నిల్వ అవసరం ఉండగా,
ఇప్పటికే 10 లక్షల టన్నుల నిల్వ సామర్థ్యాన్ని సిద్ధం చేసినట్లు ఆయన చెప్పారు. అవసరమైన గన్నీ సంచులు అందుబాటులో ఉంచామని, అంతర్జాతీయ పరిస్థితుల కారణంగా సరఫరాలో కొంత అంతరాయం ఉన్నప్పటికీ ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు. రైతులు స్వయంగా గన్నీ సంచులు తీసుకువస్తే డిబిటిద్వారా చెల్లింపులు చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. హమాలీలు, గన్నీ సంచులు, నిల్వ సామర్థ్యం అంశాలపై కలెక్టర్లతో నిరంతర సమన్వయం కొనసాగుతోందన్నారు. హమాలీ చార్జీలను ఒక్కో సంచికి రూ. 8.50కు పెంచినట్లు ఆయన చెప్పారు. అవసరమైన రవాణా వాహనాలను కూడా సిద్ధంగా ఉంచినట్లు ఆయన తెలిపారు.












