
ఆంధ్ర ప్రాంతానికి చెందిన రాజకీయ పార్టీలు తెలంగాణతో గిచ్చి కయ్యం పెట్టుకోవాలని చూస్తున్నట్టు ఇటీవలి పరిణామాలను బట్టి అర్థం అవుతున్నది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయి 12 సంవత్సరాలు దాటినా ఇంకా తెలంగాణ మీద, ఈ రాష్ట్రానికి మకుటాయమానంగా ఉన్న హైదరాబాద్ నగరం మీద కొన్ని ప్రాంతీయేతర రాజకీయపక్షాలు మళ్ళీ కక్ష గట్టినట్టుగా కనిపిస్తున్నది. ఇవి గాలిమాటలు కాదు. మేము కక్షగట్టాం అనడానికి ఆధారం (సోర్స్) ఏమిటి అని ఆంధ్రప్రదేశ్ లో ఇటీవల ప్రొఫెసర్ నాగేశ్వర్ మీద కేసులు పెట్టినట్టు ఈ మాటలనే వారి మీద కూడా కేసులు పెట్టే పిచ్చి ప్రయత్నం చేస్తారేమో. తాటాకు చప్పుళ్ళకు కుందేళ్ళు ఎన్నడు బెదరాలి?
ఆంధ్ర ప్రాంత పార్టీలు గిచ్చి కయ్యం పెట్టుకోచూస్తున్నాయి అనడానికి చాలా ఆధారాలున్నాయి. జూన్ 2 తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన రోజు. కోట్లాదిమంది తెలంగాణ ప్రజల కల సాకారమైన పవిత్రమైన రోజు. దాన్ని చట్టపరంగా అపాయింటెడ్ డే అన్నారు గానీ, 50 ఏళ్లకు పైబడిన సుదీర్ఘ పోరాట ఫలితాన్ని తెలంగాణ ప్రజలు అనుభవించిన మొదటి రోజు జూన్ 2. ప్రతి ఏటా సంబరం చేసుకునే రోజు. శనివారంనాడు దినపత్రికల్లో, వార్తాఛానళ్ళలో చక్కర్లు కొట్టిన ఒక వార్త ఈ గిచ్చి కయ్యాన్ని గుర్తుచేస్తున్నది. ప్రముఖ సినీనటుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఇదే జూన్ రెండవ తేదీన హైదరాబాద్ లో తన పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించనున్నట్టు ఈ వార్తల సారాంశం. తెలంగాణ తాజా రాజకీయ పరిణామాల మీద కొన్ని కీలక అంశాలు చర్చించడమే కాక భవిష్యత్ కార్యాచరణ మీద పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం కూడా పవన్ కళ్యాణ్ ఆ రోజున చేయనున్నట్టు ఈ వార్తల ద్వారా తెలుస్తున్నది. భారతదేశ పౌరులందరికీ రాజకీయ పార్టీలు ఏర్పాటు చేసుకునే స్వేచ్ఛ, తాము నమ్మిన రాజకీయాలు ఆచరించే స్వేచ్ఛ, దేశంలోని ఏ ప్రాంతంలో అయినా తమ రాజకీయ కార్యకలాపాలు నిర్వహించుకునే స్వేచ్ఛ ఈ దేశ రాజ్యాంగం ఇచ్చింది.
ఇతర చాలా రాజకీయ పార్టీలు తమ కార్యక్రమాలు చేసుకున్నట్టు జనసేన కూడా తెలంగాణలో రాజకీయాలు చేస్తే ఎవరికీ అభ్యంతరం ఉండకూడదు. కానీ ఒకవైపు రాష్ట్ర విభజనకు తాను వ్యతిరేకమని, తెలంగాణ ఏర్పడిననాడు 14 రోజులపాటు నిద్రాహారాలు మాని ఏడుస్తూ పడుకున్నానని, గోదావరి జిల్లాల్లో అరటి పంటలో, కొబ్బరితోటలో ఎండిపోతే తెలంగాణవారి దిష్టి తగిలడమే కారణమని తెలంగాణ ప్రాంతం మీద నిత్యం విషం చిమ్మే పవన్ కళ్యాణ్ తెలంగాణలో రాజకీయాలు చేస్తానని, చేసి అధికారంలోకి వస్తానని అనుకోవడం అత్యాశ. ఇక్కడి ప్రజలు ఆయనను ఎందుకు సహించాలి? రాష్ట్ర విభజనను వ్యతిరేకించేవారు తెలంగాణలో రాజకీయాలు చేయకూడదని, చేయడానికి వీలులేదని అనేంత మూర్ఖులు ఎవరూ ఉండరు. అయితే రాజకీయాలు చేయడం అంటే ఏమిటి? ప్రజల అభిమానాన్ని చూరగొని ఎన్నికల్లో అవి ఓట్లుగా మారి అధికారంలోకి రావడమే. అది తెలంగాణలో పవన్ కళ్యాణ్ కు సాధ్యమయ్యే పనేనా?
ఇప్పుడున్న వాతావరణంలో ఒకవైపు పొరుగు రాష్ట్రంలో అధికారం చెలాయిస్తూ, తెలంగాణలో చిచ్చు రగిలించే ప్రయత్నాలు చేస్తూ మరోవైపు రాజకీయాలు చేస్తామంటే సహించి ఊరుకునే అంత సహనం, సంయమనం తెలంగాణ ప్రజలకు ఎందుకుంటుంది? పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లో మూడు పార్టీల కూటమి అధికారంలో ఉంది. ఆ కూటమిలో మూడో భాగస్వామిగా ఉన్న భారతీయ జనతా పార్టీ (అక్కడి శాసనసభలో సంఖ్యాపరంగా మూడవ స్థానంలో ఉంది కాబట్టి ఆ మాట అనాల్సి వచ్చింది) తెలంగాణలో అధికారంలోకి రావాలని కలలు కంటున్నది. అయితే తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ లాగ కూటమిగా వస్తే తెలంగాణ ప్రజలు తమను కూడా దూరం కొడతారని తెలుసు కాబట్టి జనసేన, తెలుగుదేశం పార్టీలతో తెలంగాణలో అంటీముట్టనట్టుగానే వ్యవహరిస్తున్నది.
పవన్ కళ్యాణ్‌కు సంబంధించిన ఒక వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలంగాణ ప్రాంతానికి చెందిన ప్రొఫెసర్ నాగేశ్వర్ మీద కేసులు పెడితే భారతీయ జనతా పార్టీ సీనియర్ జాతీయ నాయకుల్లో ఒకరైన మురళీధరరావు బహిరంగంగానే ఖండించారు. బయటికి మాట్లాడలేని చాలామంది బిజెపి నాయకులు గుసగుసలుగానైనా తెలంగాణ ప్రొఫెసర్ మీద ఆంధ్రాలో కేసులు పెట్టడాన్ని నిరసించారు. హోంమంత్రి అమిత్ షాతో పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ ల భేటీలో జరిగిన విషయాలు తిరిగి జనసేన కోర్ కమిటీ సమావేశంలో ప్రస్తావనకు వస్తే ఆ విషయాన్ని ప్రొఫెసర్ నాగేశ్వర్ ఆధారం లేకుండా ఒక విశ్లేషణలో చెప్పారన్నది ఆరోపణ. ఎలక్ట్రానిక్ మీడియాలో 24 గంటల వార్త ఛానళ్ళు, సోషల్ మీడియాలో యూట్యూబ్ ఛానళ్ళు ఇవేవీ రాని కాలంలో, కేవలం వార్తాపత్రికల యుగమే నడుస్తున్నప్పుడు నాటి పత్రికలలో పనిచేసిన జర్నలిస్టులు అందరికీ తెలుసు అప్పట్లో రాజకీయపరమైన సమావేశాలు ఏవైనా జరుగుతున్నప్పుడు ఒక విలేకరిని ప్రత్యేకంగా ‘ఇన్సైడ్ బీట్’లో వేసేవారు.
ఇన్సైడ్ బీట్ అర్థం ఏమిటంటే రాజకీయ సమావేశాలు ముగిసిన అనంతరం పార్టీలవారు బయటకు వచ్చి పత్రికలవారివద్ద తమకు అనుకూలమైన విషయాన్ని మాత్రమే వెల్లడించి, వ్యతిరేక ప్రభావం చూపే సమాచారాన్ని దాచి ఉంచినప్పుడు అటువంటి సమాచారాన్ని కూడా తెలుసుకుని ప్రత్యేక వార్తలు అందించడం. సమావేశంలో పాల్గొన్నవారిలో ఒకరో ఇద్దరో తమకు బాగా పరిచయం ఉన్నవారిని పట్టుకుని వారినుంచి ఈ సమాచారాన్ని రాబట్టి ప్రత్యేక వార్తలు రాసేవారు ఈ ఇన్సైడ్ బీట్ విలేకరులు. అసలు వార్తలకంటే ఈ ఇన్సైడ్ వార్తలు ఎక్కువ ఆసక్తిగా చదివేవారు పాఠకులు. ఇటువంటి ఇన్సైడ్ వార్తలమీద రాజకీయ పక్షాలు మరునాడు స్పందించి వివరణలో, ఖండనలో ఇస్తే పత్రికలు వాటిని కూడా ప్రచురించేవి. పత్రికల్లో వచ్చిన ఆ ఇన్సైడ్ సమాచారం నిజమేనని సంబంధిత పక్షాలు ఆ తరువాత కాలంలో ధ్రువీకరించిన సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి. అంతేగాని అలాంటి సమాచారం తెలుసుకుని వార్తలు రాసే విలేకరుల మీద రాజకీయపక్షాలు కేసులు పెట్టేవి కాదు.
అయితే ఇక్కడ ఒక చిన్న తేడా ఉంది. విశ్లేషణ అనేది బయటికి వచ్చిన వార్త మీద చేసేది. ప్రొఫెసర్ నాగేశ్వర్ చేసింది బయటకు వచ్చిన వార్తను విశ్లేషించడం కాదు, ఆయనే ఒక వార్తను బ్రేక్ చేశారు. పత్రికలలోనో, టీవీ చానళ్ళలోనో పనిచేసే విలేకరులు ఆ పని చేస్తే అది తప్పే కాదు. నాగేశ్వర్ తెలంగాణ ప్రజలు గౌరవించే ఒక ప్రొఫెసర్. ఆయన విశ్లేషణల్ని ప్రజలు చాలా సీరియస్ గా తీసుకుంటారు. తెలుగుదేశం పార్టీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీల గురించి కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. పవన్ కళ్యాణ్ సమక్షంలో చేశారంటున్న వ్యాఖ్యలు ఎక్కడైనా ప్రచురితమో ప్రసారమో అయి ఉంటే, దానిమీద నాగేశ్వర్ విశ్లేషణ చేసి ఉంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఆయన మీద కేసులు పెట్టే అవకాశం ఉండేది కాదు. అయితే విశ్లేషకులు తమకు తెలిసిన సమాచారాన్ని వెల్లడించడానికి వీలులేదా అంటే నిజానికి దానికి కూడా అభ్యంతరం ఉండాల్సిన అవసరం లేదు. ఇటీవలి కాలంలో వార్తలకు, విశ్లేషణలకు మధ్య ఉన్నసన్నని గీత చెరిగిపోయింది. నాగేశ్వర్ స్పష్టంగా ఆంధ్రప్రదేశ్ లో జనసేనకు సంబంధించి జరిగిన కోర్ కమిటీ సమావేశంలో పాల్గొన్న ఒక ముఖ్యుడి ద్వారా తనకి సమాచారం అందిందని ఈ విషయాలు బయటపెడుతున్నప్పుడు చెప్పారు.
పవన్ కళ్యాణ్ గాని, నాగేశ్వర్ మీద కేసులు పెట్టిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంగానీ ఆయనకు ఆ సమాచారం అందించిన ముఖ్యుడెవరో గుర్తించి, ఇలాంటి సమాచారాన్ని బయటకు ఎలా చెప్తావు అని ఆయన మీద చర్యలు తీసుకోవాలి. ఒకవేళ ఆయనను గుర్తించలేకపోతే ఆ సమావేశంలో ఉన్న అందరినీ అనుమానించి అందరిమీద చర్యలు తీసుకోవాలి. ఇటువంటి పని ఒకసారి ఎన్.టి.రామారావు చేశారు. 1985- 89 మధ్యకాలంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా జరిగిన క్యాబినెట్ సమావేశంలో బడ్జెట్ కు సంబంధించిన చర్చ జరిగితే ఆ వివరాలు మర్నాడు పత్రికల్లో ప్రచురితమయ్యాయి. దాంతో ఆయన ఆగ్రహించి ఆ సమాచారాన్ని పత్రికలకు అందించిన మంత్రిని గుర్తించలేక మొత్తం మంత్రివర్గాన్నే రద్దు చేసి పడేశారు. ఇటువంటి చర్యలేవో తీసుకోవాలిగానీ నాగేశ్వర్ మీద కేసులు పెట్టి ప్రయోజనం ఏమిటి? తమకు వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల పట్ల విమర్శనాత్మకంగా ఎవరు మాట్లాడినా, ఎవరు విశ్లేషణలు చేసినా, వార్తలు రాసినా వెంటనే కేసులు పెట్టాలనే అత్యుత్సాహం ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ పాలకులది. ఆ అత్యుత్సాహానికి కొనసాగింపే నాగేశ్వర్ మీద పెట్టిన కేసులు.
అయినా నాగేశ్వర్ అన్నది ఏమిటి? ‘ప్రతిపక్షనేత జగన్మోహన్ రెడ్డిని అరెస్టు చేయండి’ అని పవన్ కళ్యాణ్ కేంద్ర హోం మంత్రి అమిత్ షాని కోరితే ఆయన ‘తెలుగుదేశం మన తాత్కాలిక మిత్రుడు, జగన్మోహన్ రెడ్డి మన దీర్ఘకాల మిత్రుడు’ అని పవన్ విజ్ఞప్తిని తోసిపుచ్చినట్టు నాగేశ్వర్ కు ఆ జనసేన ముఖ్యుడు చెప్పారు. నిజంగా ఇవే మాటలు మాట్లాడుకున్నారా లేదా అనేది తెలియకపోయినా నమ్మశక్యంగాని విషయం ఏమీ కాదిది. గతంలో పవన్ కళ్యాణ్ బహిరంగ వేదికల మీద నుండే జగన్మోహన్ రెడ్డిని ‘కేంద్రానికి చెప్పి నీ సంగతి చూస్తాను’ అని బెదిరించిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఇటువంటి సమాచారం ఏదైనా తెలిస్తే పూర్తిగా కొట్టిపారేయాల్సిన అవసరం లేదు. ఆ మాటకొస్తే 2019 -24 మధ్య జగన్ మోహన్ రెడ్డి అధికారంలో ఉండగా ఆయన ఎప్పుడు కేంద్రంలో ప్రధానమంత్రిని, హోం మంత్రిని కలిసినా తనమీద ఉన్న కేసులు మాఫీ చెయ్యండని బతిమాలుకోవడానికే అని వార్తలు రాసిన, ప్రసారం చేసిన చంద్రబాబునాయుడు, పవన్ కళ్యాణ్ అనుకూల మీడియా మీద ఎన్ని కేసులు పెట్టాలి? ఇదంతా పక్కన పెట్టి నాగేశ్వర్ కు ఆ సమాచారం అందించిన ఆయన మీద చర్యలు తీసుకోవాలి. నాగేశ్వర్ ను అరెస్టు చేయడంకోసం మూడు కేసులు పెట్టి పోలీసులను పంపేందుకు సిద్ధపడి, చివరకు తెలంగాణ ప్రభుత్వం సానుకూలంగా లేదన్న సమాచారం తెలిసి శృంగభంగం ఎందుకని ఆ ప్రయత్నాన్ని విరమించుకున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నాగేశ్వర్ మీద కక్ష సాధించడం కాకుండా అక్కడి రాజకీయపక్షాలకు, తమకు మధ్య ఉన్న బ్రూటస్లను గుర్తిం చే ప్రయత్నం చేయాలని సూచిస్తే బాగుంటుంది.
ఇదంతా ఏదో భావప్రకటన స్వేచ్ఛకు సంబంధించిన వ్యవహారం కదా, తెలంగాణతో ఆంధ్రప్రాంత రాజకీయ పార్టీలు గిచ్చికయ్యం పెట్టుకోవడం ఎలా అవుతుంది అని అనిపించవచ్చు. కొంతకాలంగా జరుగుతున్న ఈ ప్రయత్నానికి కొనసాగింపే నాగేశ్వర్ మీద ఆంధ్రప్రదేశ్ లో కేసులు. గత వారం రోజులుగా ఈ వ్యవహారంలో తెలంగాణా పౌర సమాజం స్పందన చూస్తే ఎవరికయినా అర్ధం అవుతుంది తెలంగాణ ప్రశాంతతను పాడు చేసే ప్రయత్నాలు ముగిసిపోలేదని. నిన్న మొన్న ఆంధ్రలో ముగిసిన తెలుగుదేశం పార్టీ హైబ్రిడ్ మహానాడులో తెలంగాణా అస్తిత్వాన్ని ఘోరంగా అవమానించే, కించపరిచే వాచాలత్వం వీటన్నిటికీ పరాకాష్ట. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కొద్దిరోజుల క్రితం ‘తెలంగాణ నా మానస పుత్రిక’ (బ్రెయిన్ చైల్డ్) అంటే, పార్టీ పాలిట్ బ్యూరో సభ్యుడు, మాజీ తెలంగాణ శాఖ అధ్యక్షుడు బక్కని నరసింహులు ‘అసలు తెలంగాణ అనే పదమే నిఘంటువులో లేదు, ఇది కొందరు స్వార్ధపరులు సృష్టించింది’ అని తన అజ్ఞానాన్ని పచ్చ వేదిక మీద పారబోసుకున్నాడు.ఇటువంటి కవ్వింపులన్నీ తెలంగాణను మరో ఉద్యమానికి ఉద్యుక్తం చేస్తాయేమో?












