
వికసిత్ భారత్ నిర్మాణంలో తెలంగాణను భాగస్వామ్యం చేస్తాం
గుజరాత్ మోడల్ నిర్మాణంలో మన్మోహన్ సహకరించినట్లే నాకూ మద్దతివ్వండి
హెచ్‌ఐసిసి సభలో ప్రధానికి సిఎం రేవంత్ విజ్ఞప్తులు
హిందీలో ప్రసంగించి ఆకట్టుకున్న ముఖ్యమంత్రి
మనతెలంగాణ/హైదరాబాద్ : ప్రధాని నరేంద్ర మోదీ ప్రణాళిక వికసిత్ భారత్‌తో కలిసి నడుస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి అన్నారు. దేశ ప్రగతికి సంబంధించిన విషయాల్లో రాజకీయాలు చేయబోమని, వికసిత్ భారత్ నిర్మాణంలో తెలంగాణను భాగస్వామిని చేస్తామని ఆయన ప్రధానికి హామీ ఇచ్చారు. జాతీయ భద్రత, జాతీయ అభివృద్ధే మనకు అత్యధిక ప్రాధాన్యం... ముందు భారత దేశం, తర్వాత ప్రజలు, ఆ తర్వాతే పార్టీ అనేది స్పష్టం అని పేర్కొన్నారు. 2047 నాటికి 30 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థను కేంద్రం లక్ష్యంగా పెట్టుకుందని, దీనిలో తెలంగాణ 3 ట్రిలియన్ డాలర్ల వాటా ఇవ్వాలని లక్ష్యంగా నిర్దేశించుకుందని వెల్లడించారు. 2034 నాటికి ట్రిలియన్ డాలర్ల ఎకానమీని తెలంగాణ సాధిస్తుందని, మోదీ ఆశీర్వాదం ఉంటే తెలంగాణ వేగంగా అభివృద్ధి చెందుతుందని చెప్పారు.
ఐదు రాష్ట్రాల ఎన్నికలు పూర్తయిపోయాయని.. ఇప్పుడు రాజకీయాల గురించి మాట్లాడాల్సిన పని లేదని, అభివృద్ధి గురించే మాట్లాడదామని ప్రధాని మోదీని ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు. హైదరాబాద్ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ ఆదివారం పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా హెచ్‌ఐసిసిలో జరిగిన సభలో సిఎం రేవంత్ రెడ్డి హిందీలో ప్రసంగించి అందరి దృష్టిని ఆకర్షించారు. దేశ జనాభాలో తెలంగాణ 3 శాతం వాటా కలిగి ఉందని, దేశ జిడిపికి తెలంగాణ 5 శాతం వాటా ఇస్తోందని తెలిపారు. ఇది కేవలం కేంద్ర ప్రభుత్వ కార్యక్రమం కాదు.. తెలంగాణ రాష్ట్రం మరింత ముందుకెళ్లేందుకు అవసరమైన అభివృద్ధి ఉత్సవం అని పేర్కొన్నారు. రాష్ట్రంలోని పెండింగ్ ప్రాజెక్టులపై ప్రత్యేకంగా ప్రధాని దృష్టి సారించాలని కోరారు. మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు గుజరాత్ అభివృద్ధికి సహకరించారని గుర్తు చేశారు.
ఆయన స్పూర్తితో మోదీ కూడా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి సహకారం అందిస్తారని ఆశిస్తున్నానని అన్నారు. నాడు మన్మోహన్సింగ్ ఆశీస్సులు అందించినట్లే మీరు తెలంగాణ ప్రజలకు ఆశీస్సులు అందించాలని మోదీని ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు. తెలంగాణ అభివృద్ధికి, రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహకరించాలని సిఎం రేవంత్ రెడ్డి ప్రధాని మోదీని కోరారు. దేశాభివృద్ధి విషయంలో రాజకీయాలకు అతీతంగా కలిసి పనిచేస్తామని స్పష్టం చేస్తూనే, తెలంగాణ అభివృద్ధికి సంబంధించిన పలు కీలక ప్రతిపాదనలను ప్రధాని ముందుంచారు. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఎప్పుడూ మోదీ చాలా పెద్ద మనసున్న వారని చెబుతుంటారు, ఆ పెద్ద మనసుతో తెలంగాణ పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని కోరారు.
తెలంగాణ కోసం రెండు గంటలు కేటాయించి.. ప్రత్యేక సమీక్ష నిర్వహించాలి
భారీ ఆర్థిక వృద్ధి, మహా నగరాలు, విశ్వ నగరాల నుంచే వస్తుందని సిఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. దేశానికి ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై, కోల్‌కతా, హైదరాబాద్ నగరాలు గ్రోత్ ఇంజన్ల వంటివని, ఈ నగరాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. ఈ దేశం ప్రపంచంలో మొదటి స్థానంలో ఉండాలంటే, యువతకు ఉద్యోగాలు రావాలంటే ఈ మహా నగరాలను అభివృద్ధి చేయాలని అన్నారు. ఈ నగరాల నుంచి వచ్చే అభివృద్ధి ప్రతిపాదనలకు సత్వరమే అనుమతులు ఇచ్చేందుకు ప్రధానమంత్రి కార్యాలయం (పిఎంఒ)లో ఒక ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ లేదా సింగిల్ విండో వ్యవస్థను ఏర్పాటు చేయాలని సూచించారు. తెలంగాణకు అత్యంత కీలకమైన రీజినల్ రింగ్ రోడ్డు, మెట్రో రైలు విస్తరణ, మూసీ నది సుందరీకరణ, ఫ్యూచర్ సిటీ రేడియల్ రోడ్లు, హైదరాబాద్- మచిలీపట్నం పోర్టు మధ్య 12 లైన్ల ఎక్స్‌ప్రెస్ హైవే, రైల్వే లైన్ వంటి పెండింగ్ ప్రాజెక్టులను సిఎం రేవంత్ రెడ్డి ప్రస్తావించారు.ఈ ప్రాజెక్టులపై చర్చించేందుకు తెలంగాణ కోసం రెండు గంటల సమయం కేటాయించి ప్రత్యేక సమీక్ష నిర్వహించాలని సిఎం రేవంత్‌రెడ్డి ప్రధాని మోదీని కోరారు.















