ఇంటికో పండ్ల మొక్క..ఆరోగ్యానికి బంగారు బాట-

వనమహోత్సవ పురోగతి సమీక్షలో మంత్రి సీతక్క

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా వనమహోత్సవాన్ని కేవలం మొక్కలు నాటే కార్యక్రమంగా కాకుండా, పచ్చని రాష్ట్రంతో పాటు ఆరోగ్యకరమైన తెలంగాణ నిర్మాణానికి ప్రజా ఉద్యమంగా ముందుకు తీసుకెళ్లాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క అన్నారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ పరిధిలో చేపట్టిన వనమహోత్సవ పురోగతిపై ఆదివారం సమీక్షించారు. కమిషనర్ దివ్య దేవరాజన్, స్పెషల్ కమిషనర్ శ్రీలక్ష్మితో కలిసి జిల్లాల వారీగా మొక్కలు నాటడం, ఇంటి ఆవరణల్లో మొక్కల పంపిణీ, గుంతల తవ్వకం, మొక్కల మనుగడపై ఈ సమీక్షలో వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ ఏడాది శాఖ పరిధిలో 6.18 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకోగా, ఇప్పటివరకు 5.61 కోట్లకు పైగా మొక్కలు నాటినట్లు అధికారులు మంత్రికి వివరించారు. దీంతో లక్ష్యంలో 91 శాతం మేర మొక్కల నాటడం పూర్తయిందని తెలిపారు. గుంతల తవ్వకంలో కూడా 92 శాతం పురోగతి సాధించినట్లు వెల్లడించారు. జిల్లాల పనితీరును సమీక్షించిన మంత్రి సీతక్క, నిర్దేశించిన లక్ష్యాల సాధనలో అధికారులు చూపుతున్న చొరవపై సంతృప్తి వ్యక్తం చేశారు. మిగిలిన లక్ష్యాన్ని కూడా వర్షాలు అనుకూలంగా ఉన్న ప్రస్తుత సమయంలో త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. అయితే మొక్కలు నాటడంతోనే బాధ్యత పూర్తికాదని మంత్రి స్పష్టం చేశారు.

నాటిన ప్రతి మొక్క బతికి ఎదగడమే వనమహోత్సవం అసలు విజయమని అన్నారు. మొక్కలకు క్రమం తప్పకుండా నీరు అందించడం, సంరక్షణ చర్యలు చేపట్టడం, మనుగడను క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. వనమహోత్సవంలో భాగంగా ఇంటి ఆవరణల్లో నాటేందుకు పెద్ద ఎత్తున మొక్కలను పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ముఖ్యంగా పండ్ల మొక్కలను ప్రతి కుటుంబానికి చేరవేసే కార్యక్రమానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ఈ ఏడాది 2.75 కోట్ల పండ్ల మొక్కలను పంపిణి చేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రతి ఇంట్లో పండ్ల మొక్క పెంచడం అంటే కేవలం పచ్చదనం పెంచడం మాత్రమే కాదు.. కుటుంబ ఆరోగ్యానికి పెట్టుబడి పెట్టడం కూడా అని మంత్రి సీతక్క పేర్కొన్నారు. జామ, ఉసిరి, మామిడి, సీతాఫలం, మునగ వంటి పండ్ల మొక్కలను ఇంటి వద్ద పెంచుకోవడం ద్వారా కుటుంబ సభ్యులకు తాజా, సహజమైన పోషకాహారం అందుబాటులోకి వస్తుందని చెప్పారు. ప్రతి ఇంట్లో పండ్ల మొక్క, ప్రతి గ్రామంలో విస్తారమైన పచ్చదనం ఉండేలా ప్రజలందరూ భాగస్వాములు కావాలని ఆమె పిలుపునిచ్చారు.