శుక్రవారం అర్థరాత్రి ‘మహా రాజకీయం జరిగింది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ ఉన్నట్లుండి శివసేన (యుబిటి) నేత, మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరేతో భేటీ అయ్యారు. ఇది అత్యంత కీలక రహస్య భేటీ అయింది. దీనిపై రాజకీయ వర్గాలలో సంచలనాత్మక కథనాలు వెలువడ్డాయి. ముంబైలోని మాత్రోశ్రీ నివాసానికి వెళ్లి సిఎం ఈ నాయకుడితో సమావేశం అయ్యారు. అయితే బిజెపి నేత అయిన ఫడ్నవిస్ ఈ వార్తలను ఖండించారు. ఇటువంటి ఎటువంటి ఆంతరంగిక సమావేశం జరగలేదని శనివారం వివరణ ఇచ్చారు. మహారాష్ట్ర శాసన మండలి ఎన్నికలు కొన్ని జరుగనున్న నేపథ్యంలో ఇరువురు కీలక విషయాలపై చర్చించుకున్నారని సామాజిక మాధ్యమాలు విశ్లేషించాయి. ఒకప్పుడు అత్యంత సన్నిహిత మిత్రపక్షాలుగా ఉన్న బిజెపి, శివసేనల మధ్య ఇటీవలికాలంలో దూరం పెరిగింది. పైగా ఉద్ధవ్ పూర్తి స్థాయిలో కాంగ్రెస్ ఇతర ప్రతిపక్షాల ఇండియా కూటమికి చేరువ అయ్యారు.

అయితే తాను ఉద్ధవ్‌ను కలుసుకున్నాననే వార్త సరికాదని, అయినా ఆయనను రహస్యంగా కలుసుకోవల్సిన అవసరం లేదని ఫడ్నవిస్ తెలిపారు. కావాలనే కొందరు తప్పుడు వార్తలతో రాజకీయ సమస్యలకు యత్నిస్తున్నారని, అటువంటి వారిపై తగు రీతిలో చర్యలు ఉంటాయని ఫడ్నవిస్ హెచ్చరించారు. ఈ పరిణామాలపై బిజెపి సీనియర్ నేత , మాజీ మంత్రి సుధీర్ ముంగన్‌తివార్ స్పందించారు. వీరి భేటీకి అవకాశం లేదన్నారు. ఇద్దరూ సీనియర్ నేతలు, రహస్య సమావేశాల అవసరం లేదని తెలిపారు. కలుసుకోవాలనుకుంటే ముందుగా ప్రకటించే కలుసుకుంటారని అన్నారు. రాష్ట్రంలో ప్రతిపక్షాల కూటమి అయిన మహా వికాస్‌అఘాదీ (ఎంవిఎ)లో శివసేన యుబిటి, కాంగ్రెస్, శరద్ పవార్ సారధ్య ఎన్‌సిపి ఎస్‌పి భాగస్వామ్యపక్షాలుగా ఉన్నాయి. మహారాష్ట్ర కౌన్సిల్ ఎన్నికలలో ప్రతిపక్ష కూటమి నుంచి ఉద్ధవ్‌ను అభ్యర్థిగా నిలపాలని పెద్ద ఎత్తున పావులు కదుపుతున్నారు.

ఆయన తిరిగి శాసన సభా కార్యకలాపాలలో మరింత చురుకు పాత్ర పోషించేందుకు వీలు కల్పించాని యోచిస్తున్నారు. కౌన్సిల్‌లో ఖాళీగా ఉన్న తొమ్మిడి ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. ప్రస్తుత సభా బలాబలాలను బట్టి చూస్తే ఎంవిఎకు కేవలం ఒకే ఒక్క స్థానం దక్కుతుంది. ఇప్పుడు ఎమ్మెల్సీగా కాల పరిమితి ముగిసే నేతలలో ఉద్ధవ్ థాకరే కూడా ఉన్నారు. ఇక ఇరువురు నేతల సమావేశం గురించి బిజెపినే దురుద్ధేశపూరిత ప్రచారానికి దిగిందని శివసేన యుబిటి నేత , ఎంపి సంజయ్ రౌత్ విమర్శించారు. బిజెపి వారి పార్టీల విచ్ఛిన్న రాజకీయాలలో ఇదో ఎత్తుగడ అని స్పందిచారు.