
ఇలాంటి ప్రశ్నాపత్రాల అక్రమ రవాణా సాధారణంగా అత్యంత గోప్యంగా నిర్వహిస్తారని దర్యాప్తు అధికారులు చెబుతున్నారు. అయితే ఈసారి అధిక మొత్తంలో డబ్బు సంపాదించాలనే ఆశతో నెట్వర్క్ను విస్తరించడంతో ఈ వ్యవహారం బయటపడినట్లు భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ కేసులో దేశవ్యాప్తంగా పలువురిపై నిఘా ఉంచిన సీబీఐ, ప్రశ్నాపత్రం లీక్ చైన్లో పాల్గొన్న వారిని గుర్తించే పనిలో నిమగ్నమైంది. నీట్-యూజీ 2026 ప్రశ్నాపత్రం లీక్ వ్యవహారంలో దర్యాప్తు సంస్థలు సంచలన విషయాలను వెలుగులోకి తీసుకొస్తున్నాయి. ‘రేపటి పరీక్షలో ఇవే వస్తాయి’ అనే ఒక సందేశంతో ప్రారంభమైన ఈ వ్యవహారం చివరకు దేశవ్యాప్తంగా విస్తరించిన ప్రశ్నాపత్రం మాఫియాను బయటపెట్టినట్లు అధికారులు చెబుతున్నారు.
దర్యాప్తు వివరాల ప్రకారం, సికర్కు చెందిన రాకేష్ అనే వ్యక్తి మొదట ప్రశ్నాపత్రాన్ని రూ.30 వేలకే తనకు పరిచయమైన ఒక విద్యార్థికి విక్రయించాడు. ఆ విద్యార్థి కేరళలో ఎంబీబీఎస్ చదువుతున్న సికర్కు చెందినవాడిగా గుర్తించారు. పరీక్షకు కేవలం ఒక రోజు ముందు ఆ ఎంబీబీఎస్ విద్యార్థి ప్రశ్నాపత్రాన్ని సికర్లో పీజీ హాస్టల్ నిర్వహిస్తున్న తన తండ్రికి పంపించాడు. ‘నాన్నా.. సికర్కు చెందిన ఓ స్నేహితుడు ఇది పంపించాడు. మీ హాస్టల్లో ఉన్న అమ్మాయిలకు ఇవ్వండి. రేపటి పరీక్షలో ఇవే వస్తాయి’ అని సందేశంలో పేర్కొన్నట్లు దర్యాప్తు అధికారులు వెల్లడించారు. అంతగా అనుమానం పెట్టుకోకుండా ఆ పీజీ నిర్వాహకుడు హాస్టల్లో ఉంటున్న విద్యార్థినులకు ఆ ప్రశ్నాపత్రాన్ని పంపిణీ చేసినట్లు అధికారులు తెలిపారు.














