ఆకస్మికంగా వచ్చిన జల ప్రళయంతో నేపాల్ అతలాకుతలమైన విషయం తెలిసిందే. ఈ ఉపద్రవంలో వందలాది మంది ప్రాణాలు కోల్పోగా.. వేలాది మంది గల్లంతయ్యారు. దీని కారణంగా నేపాల్ ఇప్పట్లో కోలుకోలేని స్థితిలోకి వెళ్లిపోయింది. అయితే ప్రపంచవ్యాప్తంగా నేపాల్‌కు సహాయం చేసేందుకు పలువురు ముందుకొస్తున్నారు. తాజాగా కొరియన్ పాప్‌‌స్టార్ లీ నో తన దాతృత్వం చాటుకున్నారు. నేపాల్ వరద బాధితులకు 100 మిలియన్ వన్‌ల(భారత కరెన్సీలో రూ.69 లక్షలు) విరాళమిచ్చారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యల కోసం ఈ మొత్తాన్ని వరల్డ్ విజన్ అనే స్వచ్ఛంద సంస్థ ద్వారా పంపించారు.

‘‘ఈ కష్ట సమయంలో నేపాల్‌ను ఆదుకునేందుకు నా వంతు ప్రయత్నం చేశా. వీలైనంత త్వరగా ఆ దేశ ప్రజలు ఈ విపత్తు నుంచి కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నా’’ అని లీ నో ఈ సందర్భంగా వెల్లడించారు. సామాజిక సేవలో లీ నో ఎప్పుడూ ముందుంటారు. 2014 నుంచి వరల్డ్ విజన్ సంస్థతో కలిసి ప్రపంచవ్యాప్తంగా చిన్నారుల సంరక్షణ కోసం తన వంతు సాయం అందిస్తున్నారు. 2024లో ఆహార సంక్షోభంతో ఇబ్బంది పడుతున్న దేశాలకు 100 మిలియన్ వన్‌ల విరాళం అందించారు. గతేడాది కూడా తన పుట్టినరోజు సందర్భంగా తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారి కోసం భారీ విరాళమిచ్చారు.