
గుండె నిండా ఉప్పునిముడ్చుకొని
అడుగు పొరల్లో నిప్పును ఉంచుకొని
నీటి అలల్ని ఎగరేసే సముద్రం
భూమిని కోస్తుందని
వానల వరదల తనలో కలుపుకుని
నదికి పారే గుణం ఇచ్చేది
దారి చూపేది భూమేనని, ఎగుడు దిగుడు
స్వభావాల్లోంచి ఉన్నతత్వాన్ని ఆస్వాదిస్తూ
మానవుల్లో ఉత్తములు ఉంటారని,
దీపం ఎప్పుడూ వెలుగు పంచుతుందని
పువ్వులెన్నో తావినిస్తాయని,
పువ్వుల కింద ముళ్ళు ఉన్నట్లు
మనుషుల లోపల వానరులు
లోలోపల రాక్షసులు ఉండొచ్చని
నిప్పు ఉప్పు కలిసి ఉన్నా
కదపకుంటే ప్రశాంతమేనని
విడిచిన బాణం గుచ్చుకుని
తెలుసుకోలేని తెలివి తొడుగుతో
మరిగేది మర యంత్రాలని తెలియని
అమాయకత విశ్వ రహస్యంలోని మనిషిదేనని
ప్రపంచాన్ని ప్రయోగశాలగా చేసి
ప్రళయాలనే సృష్టిస్తున్నారని
నిలబడిన కొమ్మ నరుక్కుంటూ
చెట్టుని నిందిస్తున్నారని ఇప్పుడు
బాగా అర్థమైన నగ్నసత్యం
- కొండపల్లి నిహారిణి








