
నల్లగొండ: స్కూల్ విద్యార్థులే ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసినట్టు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. ఈ సంఘటన నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లి మండల కేంద్రంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... ఈ నెల 11న జెబి కాలనీకి చెందిన నాగార్జున పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపాల్ కె రూపారెడ్డిని హత్య చేశారు. అనంతరం నాలుగు లక్షల నగదుతో పాటు బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ముగ్గురు విద్యార్థులను అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. రెండు తండాలకు చెందిన విద్యార్థులు హత్య చేసినట్టు అనుమానాలు కలుగుతున్నాయి. సదరు విద్యార్థులు గంజాయి తీసుకుంటుండగా ఆమె ఫొటోలు తీయడంతో పాటు వీడియోలు కూడా తీసిందనే అనుమానంతోనే ఆమెను చంపినట్టు తెలుస్తోంది. గంజాయి సేవిస్తుండగా విద్యార్థులను పిలిచి రూపారెడ్డి క్లాస్ పీకినట్లు తెలుస్తోంది. దీంతోనే విద్యార్థులు రూపారెడ్డిని హత్య చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.








