డిజిపికి ఫోన్ చేసి వివరాలు

అడిగిన మంత్రి బాధిత

కుటుంబానికి అండగా

ఉంటామని భరోసా

మన తెలంగాణ/హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలోని ఒక ఆస్పత్రిలో విధులు నిర్వహిస్తున్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన నర్స్ శిరీష దారుణ హత్యకు గురైన ఘటనపై మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విధులు నిర్వహిస్తున్న ఓ యువతి ప్రాణాలను అత్యంత దారుణంగా బలిగొన్న ఈ ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. శిరీష హత్య విషయం తెలిసిన వెంటనే స్థానిక పోలీసు అధికారులు, పహాడిషరీఫ్ ఇనస్పెక్టర్, ఇతర అధికారులతో ఫోన్లో మాట్లాడి ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకున్నారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు మంత్రికి వివరించారు.

అనంతరం మంత్రి సీతక్క డీజీపీ సీవీ ఆనంద్‌కు ఫోన్ చేసి ఘటనపై సమగ్రంగా, ఉన్నతస్థాయి విచారణ జరపాలని సూచించారు. ఇలాంటి దారుణ ఘటనల్లో ఎలాంటి ఆలస్యం లేకుండా చట్టపరమైన విచారణను వేగవంతం చేసి, బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. తన కుటుంబానికి అండగా నిలవాల్సిన వయసులో, తన కాళ్లపై తాను నిలబడి సేవా రంగంలో పనిచేస్తున్న ఓ యువతి ఇలా దారుణంగా ప్రాణాలు కోల్పోవడం అత్యంత విషాదకరమని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. శిరీష కుటుంబ సభ్యులకు మంత్రి సీతక్క తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. బాధిత కుటుంబానికి అన్ని విధాలుగా ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.