
రాజకీయంగా ఎదుర్కోలేకే నాపై దుష్ప్రచారం
నేను ఫాంహౌస్లో ఎలుకను కాదు
సికింద్రాబాద్ సభలో బండి సంజయ్ ఫైర్
మన తెలంగాణ/హైదరాబాద్: ‘తానెప్పుడూ పార్టీ తలెత్తుకునే పనే చేస్తా తప్ప తలదించుకునే పని ఎప్పుడూ చేయనని’ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ భావోద్వేకంతో అన్నారు. రాజకీయంగా ఎదుర్కోలేకే కొందరు తనపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసిన ఆయన ఆ దుష్ప్రచారాలను ఎవరూ నమ్మొద్దని కంటతడిపెట్టుకుని విజ్ఞప్తి చేశారు.
సికింద్రాబాద్లోని పరేడ్ గ్రౌండ్లో ఆదివారం సాయంత్రం జరిగిన ప్రధాని నరేంద్రమోడీ బహిరంగ సభలో బండి సంజయ్ మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. కొందరు తన మీద కుట్రలు చేయాలని చూస్తున్నారనిఆరోపించారు. తాను ఏనాడు బీజేపీకి తలవంపులు తేలేదు, మీ తాటాకు చప్పళ్లకు భయపడేటోడిని కాదని అన్నారు. భయపెడితే భయపడటానికి మీ ఫాంహౌజ్లో ఎలుకను కాదు, అయ్యపేరు చెప్పి, ఆస్తులకు కూడగట్టుకునేటోడిని కాదని, ధర్మం కోసం పనిచేసే కాషాయ కార్యకర్తనని ఆవేశంగా ప్రసంగించారు. కాషాయ జెండా మోస్తున్న మోడీ సైనికుడినిఅంటూ చేసిన ప్రసంగంతో పరేడ్ మైదానమంతా పులకించిపోయి జై శ్రీరాం నినాదాలతో మారుమోగింది. బెంగాల్ తర్వాత మన తర్వాత మన లక్షం తెలంగాణాయేనని చెబుతూ బెంగాల్ గెలుపుతో ఆ పార్టీల నేతల్లో వణుకు మొదలైందని బండి ఎద్దేవా చేశారు.
కాంగ్రెస్, బీఆర్ఎస్ పునాదులు కదులుతున్నయ్ అంటూ సభ దద్దరిల్లిపోయేలా చేసిన ప్రసంగం అందరిని ఆకట్టుకుంది. ప్రాణం పోయినా తప్పు చేయం, తప్పు చేసే వాళ్లను కూడా వదిలిపెట్టబోమని హెచ్చరించారు. అవినీతి, అక్రమాలు, అరాచకాలు చేస్తూ తెలంగాణను ముంచినోళ్లే ఎదురుదాడి చేస్తుంటే, ఏ తప్పు చేయనోళ్లం ఊకుంటమా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అగ్గి పుట్టిద్దాం, ఆ అగ్గిలో అవినీతి, కుటుంబ పార్టీలను కాల్చి బూడిద చేద్దామంటూ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. మీరెన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా తగ్గేది లేదు, బరాబార్ బరిగీసి నిలబడతాం, కలబడతాం అంటూ కాంగ్రెస్, బిఆర్ఎస్లపై ధ్వజమెత్తారు. మోడీ నాయకత్వంలో నితిన్ నబిన్ ఆధ్వర్యంలో తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చి తీరుతామని ధీమా వ్యక్తం చేశారు.














