
మద్యం మత్తులో ఇరువర్గాల మధ్య ఘర్షణ
జూబ్లీహిల్స్ ‘కారాకారా’ పబ్బులో విధ్వంసం
ఓ రాజకీయ నేత కుమారుడి ప్రమేయం
ఎస్ఐ ఫిర్యాదుతో ఇరువర్గాలపై కేసు నమోదు
మన తెలంగాణ/సిటీ బ్యూరో: మద్యం మత్తులో రెండు వర్గాలుగా విడిపోయి కొట్టుకున్న సంఘటన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దసపల్ల హోటల్లోని కారా కారా పబ్బులో శనివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. వీకెండ్ పార్టీ జరుగుతున్న జూబ్లీహిల్స్‌లోని కారా కారా పబ్‌కి 150మంది వచ్చారు. మత్తులో రెండు వర్గాల మధ్య మొదైన చిన్న గొడవ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. గొడవ పెద్దది కావడంతో పబ్‌లోని కుర్చీలు, ర్చీలు, మద్యం సీసాలు, అద్దాలను ఒకరిపై ఒకరు విసురుకుని విధ్వంసం సృష్టించారు. దీంతో పబ్బులో ఉన్న ఇతరులు భయంతో బయటికి పరుగు తీశారు. పబ్బు నిర్వాహకులు జూబ్లీహిల్స్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అక్కడికి వచ్చి గొడవను అదుపులోకి తీసుకుని వచ్చారు. గొడవలో మాజీ ఎంపి అంజన్‌కుమార్ రెండో కుమారుడు అరవింద్ యాదవ్ గొడవ చేసినట్లు తెలిసింది. మూడేళ్ల క్రితం అరవింద్ యాదవ్ పాతబస్తీలో కూడా ఓ వ్యక్తిని బాటిల్‌తో తలపై కొట్టి హత్యాయత్నం చేసినట్లు కేసు నమోదైంది. పబ్బు గొడవపై జూబ్లీహిల్స్ పోలీసులు సుమోటాగా కేసు నమోదు చేశారు. ఎస్సై సందీప్ రెడ్డి ఫిర్యాదు మేరకు ఇరువర్గాలపై కేసు నమోదు చేశారు. మాజీ ఎంపి కుమారుడు, ఎంపి సోదరుడితోపాటు 20మంది గొడవలో పాల్గొన్నట్లు పోలీసులు గుర్తించారు. సిసిటివి ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించి చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు. కాగా, సమయం దాటినా పబ్బును నడపడంపై దసపల్ల కారా కారా పబ్బు నిర్వాహకులపై పోలీసులు కేసు నమోదు చేశారు.













