
మన తెలంగాణ/హైదరాబాద్/నాంపల్లి: హైదరాబాద్‌లో నిరుపేదల సొంతింటి కలను నిజం చేస్తూ, వారి ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచే ఇం దిరమ్మ టవర్స్ నిర్మాణానికి పారదర్శకంగా లబ్దిదారుల ఎంపిక చేపడుతున్నట్లు రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. అర్హ తే ప్రామాణికంగా, కులమతాలు, రాజకీయాల కు అతీతంగా లబ్ధిదారుల ఎంపిక జరుగుతోంద ని ఆయన స్పష్టం చేశారు. క్యూర్ ప్రాంతంలో తొలి విడతగా చేపడుతున్న ఇందిరమ్మ టవర్స్ లో ఫ్లాట్ల కేటాయింపునకు అత్యంత పారదర్శకంగా లక్కీడ్రా నిర్వహిస్తున్నామని తెలిపారు. మీడియా, అర్హులైన లబ్ధిదారుల సమక్షంలో లక్కీ డ్రా నిర్వహిస్తూ, మొత్తం ప్రక్రియను అన్ని సా మాజిక మాధ్యమాల ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నామని ఆయన తెలిపారు. శుక్రవారం నాంపల్లి, కుత్బుల్లాపూర్, సికింద్రాబాద్, రాజేంద్రనగర్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇందిరమ్మ టవర్స్ ఫ్లాట్ల కోసం లక్కీడ్రా నిర్వహించారు. నాంపల్లి నియోజకవర్గంలోని రెడ్‌హిల్స్ ని ర్మించనున్న ఇందిరమ్మ టవర్స్ ఫ్లాట్ల కేటాయింపునకు వెట్ గార్డెన్స్‌లో, రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని మైలార్‌దేవుపల్లి పరిధికి సంబంధించి లక్ష్మీగూడలో నిర్వహించిన లక్కీడ్రా కార్యక్రమాల్లో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొని డ్రా తీశారు.
ఈ నెల 31వ తేదీ వరకు16 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 8 వేల ఫ్లాట్లకు లక్కీడ్రా
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈ రోజు నుంచి ఈ నెల 31వ తేదీ వరకు 16 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సుమారు 8 వేల ఫ్లాట్లకు లక్కీడ్రా నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. రోజుకు నాలుగు నియోజకవర్గాల చొప్పున లక్కీడ్రా ప్రక్రియ కొనసాగుతుందని ఆయన చెప్పారు. ప్రతి నియోజకవర్గంలో 480 ఫ్లాట్లకు 600 మంది లబ్ధిదారులను లక్కీడ్రా ద్వారా ఎంపిక చేస్తామని మంత్రి పొంగులేటి వివరించారు. అనంతరం అధికారులు క్షేత్రస్థాయిలో తుది పరిశీలన నిర్వహిస్తారని, ఎంపికైన వారిలో ఎవరైనా అనర్హులుగా తేలితే మిగిలిన 120 మందిలోని అర్హులకు అవకాశం కల్పిస్తామని మంత్రి చెప్పారు. ఈ విధానం ద్వారా అర్హులైన పేదలకు న్యాయం జరిగేలా చూస్తామని మంత్రి స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఈ నెల 13న కూకట్‌పల్లి కెపిహెచ్‌బీ కాలనీలో ఇందిరమ్మ టవర్స్‌కు శంకుస్థాపన చేశారని మంత్రి పొంగులేటి గుర్తు చేశారు. అనంతరం ఈ 16 నియోజకవర్గాల్లో ఇందిరమ్మ టవర్స్ నిర్మాణానికి టెండర్లు పిలవడం, మరోవైపు లబ్ధిదారుల ఎంపిక కోసం లక్కీడ్రా నిర్వహించడం రాష్ట్ర ప్రభుత్వానికి గొప్ప విజయమమన్నారు.
రెండో విడతలో మరో 2.50 లక్షల ఇళ్లు మంజూరు
క్యూర్ పరిధిలో తొలి విడతగా లక్ష ఇళ్ల నిర్మాణాన్ని లక్ష్యంగా పెట్టుకొని ప్రభుత్వం ముందుకు సాగుతున్నామని మంత్రి పొంగులేటి తెలిపారు. మరో నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల్లో స్థలాల గుర్తింపు ప్రక్రియ పూర్తయిందని, ఆయా నియోజకవర్గాల్లో ఇందిరమ్మ ఇళ్ల కోసం సెప్టెంబర్ 3వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని మంత్రి పొంగులేటి వెల్లడించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తొలి సంవత్సరంలోనే రాష్ట్రవ్యాప్తంగా తొలి విడతలో 4.50 లక్షల ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసిందని మంత్రి పొంగులేటి తెలిపారు. ఇప్పటికే 2 లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయన్నారు. ప్రతి ఇంటికి రాష్ట్ర ప్రభుత్వం రూ.5 లక్షల ఆర్థిక సాయాన్ని నాలుగు విడతల్లో అందిస్తున్నామని, చివరి విడత బిల్లుల చెల్లింపులు కూడా ప్రారంభమయ్యాయని మంత్రి వివరించారు. రెండో విడతలో మరో 2.50 లక్షల ఇళ్లను మంజూరు చేసి, లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను వేగవంతం చేస్తున్నామని మంత్రి పొంగులేటి తెలిపారు. మరో పది రోజుల్లో రెండో విడత లబ్ధిదారుల ఎంపిక కూడా పూర్తయ్యే అవకాశం ఉందని మంత్రి పొంగులేటి పేర్కొన్నారు.
ప్రభుత్వానికి డబ్బు కూడబెట్టుకోవడం కంటే పేదవాడి ఆత్మగౌరవానికి ప్రతీకగా సొంత ఇంటిని అందించడం ముఖ్యమన్నారు. ఎకరం రూ.100 కోట్లు, రూ.200 కోట్లు, రూ.300 కోట్లు విలువ చేసే ప్రాంతాల్లోనూ పేద కుటుంబాలు గౌరవంగా జీవించాలని మంత్రి స్పష్టం చేశారు. ఇందిరమ్మ టవర్స్‌లో ఇల్లు పొందిన అర్హులైన లబ్ధిదారులకు ఒక్క పైసా ఖర్చు లేకుండా రిజిస్ట్రేషన్ చేసి ఇస్తామని మంత్రి పొంగులేటి తెలిపారు. రిజిస్ట్రేషన్ అనంతరం పదేళ్ల తర్వాత అవసరాన్ని బట్టి ఇంటిని విక్రయించుకునే సదుపాయం ఉంటుందని మంత్రి పొంగులేటి చెప్పారు. అంతకుముందే ఏదైనా అత్యవసర అవసరం ఏర్పడితే, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్‌ను బ్యాంకులో కుదువ పెట్టుకొని రుణం పొందే అవకాశం కూడా ఉంటుందని మంత్రి పొంగులేటి వివరించారు. లక్కీడ్రా పూర్తయిన తర్వాత లబ్ధిదారుల తుది ఎంపిక జరుగుతుందని, అధికారుల పరిశీలన అనంతరం సర్టిఫికెట్లు అందజేస్తారని మంత్రి పొంగులేటి తెలిపారు. ఆ తర్వాత కేవలం 3-, 4 రోజుల్లోనే టవర్స్ నిర్మాణ పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామని మంత్రి పొంగులేటి చెప్పారు. స్థానిక ఎమ్మెల్యే మాజిద్ హుస్సేన్, హౌసింగ్ ఎండి వి.పి. గౌతమ్, కలెక్టర్ ప్రియాంక తదితర అధికారుల సమక్షంలో లబ్ధిదారులతోనే డ్రా తీయించారు.
అదృష్టమంటే ఇదేనేమో..!
ఆ కుటుంబానికి కన్నకొడుకే లక్కీ డ్రా ద్వారా సొంతింటి కల నెరవేర్చాడు. శుక్రవారం హైదరాబాద్‌లోని క్యూర్ పరిధిలో రాష్ట్ర ప్రభుత్వం నిర్మించనున్న ఇందిరమ్మ టవర్స్‌లో ఫ్లాట్ల కేటాయింపునకు లక్కీడ్రా ప్రారంభమైంది. రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని మైలార్‌దేవుపల్లి లక్ష్మీగూడలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, స్థానిక ఎమ్మెల్యే టి.ప్రకాష్‌గౌడ్, అధికారులతో కలిసి లక్కీడ్రాను ప్రారంభించారు. రెండేళ్ల కుమారుడిని ఎత్తుకొని ఆతృతగా చూస్తున్న జె.లక్ష్మిని మంత్రి చూశారు. అమ్మ ఇలా రా..? మీవాడి చేత కూపన్ తీపించు అన్నారు. సంతోషంగా డ్రా వేదికపైకి వెళ్లిన లక్ష్మి తన కుమారుడితో ఒక చీటీ తీయించింది. లక్కీ డ్రా టోకెన్ తీసిన ఆ చిన్నోడి కుటుంబానికే ఇల్లు వచ్చిందని అధికారులు ప్రకటించారు.
డ్రా తీసిన చిన్నోడి కుటుంబానికే ఇందిరమ్మ ఇల్లు రావడం సంతోషంగా ఉందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. పేదల సొంతింటి కల తీర్చాలనే ప్రభుత్వ సంకల్పానికి దేవుడి ఆశీస్సులు తోడైనట్టు ముక్కుపచ్చలారని బాలుడి కుటుంబానికే టోకెన్ రావడం ఆనందం కలిగించడంతోపాటు ఆశ్చర్యానికి గురిచేసిందని పేర్కొన్నారు. ఇల్లు వచ్చిన లక్ష్మి శంషాబాద్ ప్రాంతానికి చెందినవారుకాగా.. కొంతకాలంగా లక్ష్మీగూడలో అద్దె ఇంట్లో ఉంటూ కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నారు.








