ఇండియన్ ప్రీమియర్ లీగ్ 19వ సీజన్ ఆరంభంలో వరుస విజయాలతో పాయింట్ల టేబుల్‌లో అగ్రస్థానంలో ఉన్న పంజాబ్ కింగ్స్ జట్టు ఆ తర్వాత మాత్రం చతికిలపడింది. వరుసగా నాలుగు మ్యాచుల్లో ఓడిపోయి ప్లేఆఫ్స్‌కు వెళ్లే అవకాశాలను దూరం చేసుకుంటుంది. ఈ నేపథ్యంలో పంజాబ్ జట్టు, ఆటగాళ్లపై రకరకాల వార్తలు వచ్చాయి. వారిలో క్రమశిక్షణ, సమన్వయం లోపించిందని.. దీని వల్లే వరుస ఓటములను ఎదురుకోవాల్సి వస్తుందని జోరుగా ప్రచారం జరుగుతూ వచ్చింది. దీంతో పంజాబ్ జట్టు సహ యజమాని ప్రీతి జింటా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి అసత్య ప్రచారం చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.

‘‘విమర్శలు, అసత్య ప్రచారం మధ్య చాలా తేడా ఉంటుంది. గేమ్ గురించి ఆరోగ్యకరమైన చర్చను మేం స్వాగతిస్తాం. కానీ, ఉద్దేశపూర్వకంగా అసత్య కథనాలను వ్యాప్తి చేస్తూ.. మా ఆటగాళ్లు, జట్టు పరువుకు భంగం కలిగిస్తే మాత్రం సహించేది లేదు. నిరాధార సమాచారం విషయంలో మీడియా అప్రమత్తంగా, బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరుతున్న’’ అంటూ ప్రీతి ఎక్స్‌లో పోస్ట్ చేశారు.