పోక్సో కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి సాయిభగీరథ్‌కు పేట్‌బషీరాబాద్ పోలీసులు మంగళవారం నోటీసులు జారీ చేశారు. కరీంనగర్‌లోని బండి సాయిభగీరథ్ ఇంటికి వెళ్లి అతడు అందుబాటులో లేకపోవడంతో అతడి మేనమామ వంశీకృష్ణకు పేట్‌బషీరాబాద్ పోలీసులు నోటీసులు అందజేశారు. బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. బండి సాయి భగీరథ్ తనపై అత్యాచారం చేశాడని, పలుమార్లు మద్యం తాగించి మొయినాబాద్‌లోని ఓ రిసార్ట్‌లో అఘాయిత్యానికి పాల్పడినట్లు బాధితురాలు పేట్‌బషీరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోక్సో కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి పరారీలో ఉన్న సాయిభగీరథ్‌ను విచారించేందుకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. డిసిపి రితిరాజ్ ఆధ్యర్యంలో ఏర్పాటైన సిట్ కేసు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ క్రమంలోనే డిసిపి రితిరాజ్ సమక్షంలో పోలీసులు మరోసారి స్టేట్‌మెంట్‌ను రికార్డు చేశారు. బాలిక చెప్పిన వివరాల మేరకు కేసులో సెక్షన్ 5(1), రెడ్‌విత్ 6 సెక్షన్లను కలిపారు.


పరారీలో భగీరథ్...

పోక్సో కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బండి సాయిభగీరథ్ పోలీసులకు చిక్కకుండా పరారైనట్లు తెలిసింది. కేసు నమోదు కాగానే ఫోన్ స్విఛ్ ఆఫ్ చేసి అజ్ఞాతంలోకి వెళ్లినట్లు విశ్వసనీయంగా తెలిసింది. పోలీసులు నోటీసులు జారీ చేయడంతో బుధవారం విచారణకు వస్తాడా రాడా అనే విషయం తేలాల్సి ఉంది. విచారణకు హాజరు కాకుండా ఉంటే పోలీసులు ఎలాంటి స్టెప్ తీసుకుంటారనే విషయం తెలియాల్సి ఉంది.

ఎవరైనా చట్టం ముందు సమానమేః బండి సంజయ్, కేంద్ర మంత్రి

సాయి భగీరథ్ తన కుమారుడైన చట్టం ముందు సమానమేనని కేంద్ర మంత్రి బండి సంజయ్ తెలిపారు. తన కుమారుడు తప్పు చేస్తే చట్ట ప్రకారం శిక్షకు సిద్ధమేనని వెల్లడించారు. బాలిక, తాను స్నేహితులమని తన కుమారుడు చెప్పాడని తెలిపారు.