న్యూఢిల్లీ : నీట్‌యూజీ పేపర్ లీక్ వ్యవహారంతో ఈనెల 3న జరిగిన పరీక్షను ఎన్‌టీఏ రద్దు చేయడంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ తీవ్రంగా స్పందించారు. దాదాపు 22 లక్షల మందికి పైగా విద్యార్థులు పడిన కష్టం, వారి కలలు బీజేపీ సారథ్యం లోని అవినీతి వ్యవస్థ వల్ల చిన్నాభిన్నమయ్యాయన్నారు. ఈమేరకు ఆయన ఎక్స్‌లో పోస్టు పెట్టారు. కొందరు విద్యార్థుల తల్లిదండ్రులు రుణాలు తీసుకున్నారు. ఇంకొందరు తల్లులు తమ నగలు అమ్ముకున్నారు. లక్షలాది మంది విద్యార్థులు ఈ పరీక్ష కోసం ఎన్నో రాత్రులు మేల్కొని ఉండి చదివారు. ఇందుకు వారికి దక్కిన ప్రతిఫలం ఏంటంటే , పేపర్ లీకేజీలు, ప్రభుత్వ నిర్లక్షం, విద్యావ్యవస్థలో వ్యవస్థీకృతమైన అవినీతి.

ఇది కేవలం ఒక వైఫల్యం కాదు, దేశ యువత భవిష్యత్తుపై జరిగిన నేరం. ప్రతిసారి పేపర్ మాఫియా ఎలాంటి శిక్షలేకుండా తప్పించుకుని తిరుగుతుండగా, నిజాయతీ పరులైన విద్యార్థులు మాత్రం శిక్ష అనుభవిస్తున్నారు. ఇప్పుడు లక్షలాది మంది విద్యార్థులు మరోసారి అదే మానసిక ఒత్తిడి , ఆర్థిక పరమైన భారం, అస్థిరతను భరించాల్సి వస్తోంది. ఒకరి తలరాతను వారి శ్రమతో కాకుండా డబ్బు, పలుకుబడితో నిర్ణయిస్తుంటే ఇక విద్యకు నిజమైన అర్థం ఏముంటుంది? ప్రధాని మోడీ చెబుతోన్న ‘ అమృత్ కాలం ’... దేశానికి విషయుగంగా మారింది ” అని రాహుల్ ఆక్షేపించారు.