
బిజెపి బహిరంగ సభలో ప్రధానమంత్రి ప్రసంగం ‘మన్ కీ బాత్’ తరహాలో ఉందని తెలంగాణ జనసమితి (టిజెఎస్) అధ్యక్షుడు, ఎంఎల్‌సి ప్రొ. కోదండరాం అన్నారు. తెలంగాణ ప్రజల సమస్యలపై స్పష్టత ఇవ్వలేదని ఆచప విమర్శించారు. సోమవారం మీడియా సమావేశంలో ప్రొ. కోదండరాం మాట్లాడుతూ జనగణనలో కులగణన, బిసిల 42 శాతం రిజర్వేషన్లపై ప్రధాని ప్రకటన చేస్తారని ఆశించామని, కాని బంగారం కొనొద్దు, పెట్రోల్, డీజిల్ వినియోగం తగ్గించాలని సుభాషితాలు చెప్పిపోయారని అన్నారు. ఈ సుభాషితాలు దూరదర్శన్‌లో కూర్చుని కూడా చెప్పవచ్చని ఎద్దేవా చేశారు. జల విహార్‌లో తెలంగాణ జన సమితి 4వ ప్లీనరీ నిర్వహిస్తున్నామని కోదండరాం తెలిపారు. గత ప్లీనరీలో తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగా బిఆర్‌ఎస్ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేశామని, ఉద్యోగులు,
ఉపాధ్యాయులు, నిరుద్యోగుల సమస్యలపై పోరాటం చేశామని వివరించారు. ప్లీనరీలో గత పోరాటాలు, విజయాలను సమీక్షించుకుని, భవిష్యత్తు కార్యాచరణను రూపొందిస్తామని చెప్పారు. కాంగ్రెస్‌తో కలిసి పని చేసినా తమ అస్తిత్వాన్ని కోల్పోమని కోదండరాం స్పష్టం చేశారు. అన్ని జిల్లాల నుంచి ప్రతినిధులు ప్లీనరీకి వస్తున్నారని తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో టిజెఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు ధర్మార్జున్, బైరీ రమేష్, పల్లె వినయ్, మోగడంపల్లి ఆశప్ప, నిజ్జన రమేష్, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు ఎం. నర్సయ్య, రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు ధార సత్యం, నాయకులు వైజెఎస్ సలీం పాషా, విజెఎస్ ఎం. అరుణ్ కుమార్, సర్దార్ వినోద్ కుమార్, శంకర్ రావు, చంద్రగిరి సత్యనారాయణ, హనుమంత్ రెడ్డి, బట్టల రాంచందర్, లక్ష్మణ్, రసూల్ ఖాన్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.














