మన తెలంగాణ/హైదరాబాద్: ప్రధాని నరేంద్రమోడీ హైదరాబాద్ పర్యటన ముగించుకొని ఆదివారం రాత్రి గుజరాత్ బయలుదేరి వెళ్లారు. బేగంపేట ఎయిర్‌పోర్టు నుండి బయలుదేరిన ప్రధాని మోడీకి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, అజారుద్దీన్ వీడ్కోలు పలికారు. దేశ వ్యాప్తంగా జరుగుతున్న జనగణనలో బీసీ కుల గణనకి సంబంధించి హౌస్ హోల్డర్స్ కాలం 13లో లేదని, బీసీ కుల గణన చేర్చాలని ప్రధాని నరేంద్ర మోడీకి విజ్ఞప్తి చేస్తూ ప్రోటోకాల్ చైర్మన్ హర్కర వేణుగోపాల్‌తో కలిపి వీరు వినతి పత్రం సమర్పించారు.

ప్రధానికి ఘనంగా వీడ్కోలు పలికిన బిజెపి నేతలు

హైదరాబాద్ పర్యటన ముగించుకుని గుజరాత్ బయలుదేరిన ప్రధాని నరేంద్రమోడీకి రాష్ట్ర బిజెపి నేతలు వీడ్కోలు పలికారు. బేగంపేట్ విమానాశ్రయం వరకు వెళ్లి ఆయన రాష్ట్ర పర్యటనకు విచ్చేసినందుకు కృతజ్ఞతలు చెబుతూ వీడ్కోలు పలికారు. వీడ్కోలు పలికిన వారిలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు రాంచంద్రరావు, కేంద్రమంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె.లక్ష్మణ్, పలువురు లోక్‌సభ సభ్యులు, రాష్ట్ర నాయకులు ఉన్నారు.