
మంత్రివర్గం నుంచి కొండా ఔట్?
అసెంబ్లీ సమావేశాలకు ముందే
నిర్ణయం 3న తేల్చనున్న అధిష్ఠానం
ఢిల్లీకి రావాలని ముఖ్యమంత్రి,
డిప్యూటీ సిఎం, పిసిసి చీఫ్‌కు పిలుపు
ప్రాతినిధ్యం లేని జిల్లాలు,
సామాజిక సమీకరణాలపై రేవంత్
కసరత్తు మంత్రులుగా పరిశీలనలో
ఆది శ్రీనివాస్, సుదర్శన్‌రెడ్డి,
బాలూనాయక్, రాజగోపాల్ రెడ్డి,
గడ్డం ప్రసాద్ పేర్లు సభాపతిగా
మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేరు
పరిశీలన ఒప్పించే పనిలో సిఎం
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండున్నర ఏండ్లు (సగం కాలపరిమితి) పూర్తికావడంతో ఇక మంత్రివర్గంలో ఉన్న ఖాళీల భర్తీపై అధిష్టానం దృష్టిసారించిం ది. దసరా నాటికి మంత్రివర్గాన్ని పునర్ వ్యవస్థీకరించాలని అధిష్టానం, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ముందు భావించినప్పటికీ మంత్రి కొండా సు రేఖ వివాదంతో అంతకుముందే చేపట్టక తప్పని అనివార్య పరిస్థితి ఏర్పడినట్లు ఆ పార్టీ వర్గాల సమాచారం. ఈ అంశంపై చర్చించడానికి సెప్టెంబర్ 3న ఢిల్లీకి రావాల్సిందిగా సీఎం రేవంత్‌రెడ్డికి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ కు ఏఐసీసీ సంస్థాగత జాతీయ ప్రధాన కార్యదర్శి కేసి వేణుగోపాల్ నుంచి పిలుపు అందినట్లు ఈ వర్గాల సమాచారం. మంత్రి కొండా సురేఖపై చర్యకు పార్టీ క్రమశిక్షణ కమిటీ, టీపీసీసీ సిఫారసు చేయడంతో ఆమె ఒక్కరినే మంత్రిమండలి నుంచి తప్పిస్తే సరిపోతుందా? లేక పనిలో పని గా మంత్రిమండలిని పునర్ వ్యవస్థీకరణ చేయడమా? అని అధిష్టా నం యోచిస్తోన్నట్టు సమాచారం.
కొండా సురేఖను బర్తరఫ్ చేయడం కంటే పునర్ వ్యవస్థీకరణలో కేబినెట్ నుంచి ఆమెను తొలగించడాని కే అధిష్టానం మొగ్గుచూపుతున్నట్టు సీఎంఓ వర్గాల సమాచారం. ఇదే విషయాన్ని పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ ఒక ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వూలో పరోక్షంగా ధృవీకరించడం గమనార్హం. పార్టీలో ఇటీవల వీస్తోన్న అసంతృప్తి సెగలు, ఖాళీ గా ఉన్న మంత్రిపదవులు, భర్తీ చేయాల్సిన నామినేటెడ్ పదవులు వీ టన్నింటికీ సెప్టెంబర్‌లో పరిష్కారం లభించబోతుందని మహేశ్‌కుమార్‌గౌడ్ వెల్లడించారు. అలాగే మూడు, నాలుగు రోజులుగా సీఎం రేవంత్‌రెడ్డి తనకు అత్యంత సన్నిహితులతో మం త్రివర్గ పునర్ వ్యవస్థీకరణపై కసరత్తు చేస్తోన్నట్లు కూడా సమాచారం. మంత్రివర్గంలో ఖాళీ గా ఉన్న రెండు పదవులతో పాటు కొండా సురేఖను తప్పించడం వల్ల ఏర్పడనున్న మూడు ఖాళీలకు ప్రాతినిధ్యం లభించని జిల్లాలు, సామాజిక వర్గాలతో భర్తీ చేసేలా సీఎం రేవంత్‌రెడ్డి ఇప్పటికే ప్రతిపాదనలను తయారు చేసినట్లు చెబుతున్నారు. ప్రస్తుత మంత్రివర్గంలో ఉమ్మడి రంగారెడ్డి, నిజామాబాద్ జిల్లాలకు ప్రాతినిధ్యం లేదు. అలాగే ఎస్టీలలో అధికశాతంజనాభా కలిగిన లంబాడీలకు ప్రాతినిధ్యం కల్పించలేదు. ప్రస్తుతం మంత్రివర్గంలో బీసీ సామాజికవర్గం నుంచి పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, వాకిటి శ్రీహరి ముగ్గురు ఉన్నారు. వీరిలో కొండా సురేఖను తప్పించడం వల్ల బీసీలకు ప్రాతినిధ్యం తగ్గకుండా అదే బీసీ సామాజిక వర్గాల నుంచి ఒకరికి అవకాశం కల్పించే విధంగా కసరత్తు చేస్తోన్నట్లు తెలిసింది. మూడింటిలో ఒకటి తిరిగి బీసీలకు ఇస్తే రెండు మంత్రిపదవులు ఉంటాయి. వీటిని ప్రాతినిధ్యం లభించని రంగారెడ్డి, నిజామాబాద్ జిల్లాల నుంచి అవకాశం కల్పించే పక్షంలో నిజామాబాద్ జిల్లా నుంచి మాజీ మంత్రి పి సుదర్శన్‌రెడ్డి, రంగారెడ్డి జిల్లా నుంచి మల్‌రెడ్డి రంగారెడ్డి, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి పేర్లు పరిశీలనలో ఉన్నట్టు తెలిసింది.
నల్లగొండ జిల్లా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్‌గోపాల్‌రెడ్డి కూడా మంత్రిపదవిని ఆశిస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికలలో భువనగిరి నుంచి చామల కిరణ్‌కుమార్‌రెడ్డిని గెలిపిస్తే మంత్రిపదవి ఇస్తామని సీఎం రేవంత్‌రెడ్డి హామీ ఇవ్వడమే కాకుండా అదేమాటను అధిష్టానం నుంచి చెప్పించినట్లు కోమటిరెడ్డి రాజ్‌గోపాల్‌రెడ్డి బాహాటంగానే ప్రస్తావిస్తున్నారు. రాజ్‌గోపాల్‌రెడ్డికి హామీ ఇచ్చినమాట వాస్తవమేనని పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ తాజాగా వెల్లడించారు. ఈ లెక్కన రాజ్‌గోపాల్‌రెడ్డికి మంత్రిపదవి ఇచ్చే పక్షంలో రంగారెడ్డి జిల్లా నుంచి స్పీకర్ ప్రసాద్‌కుమార్‌ను మంత్రివర్గంలోకి తీసుకొని ఎస్టీ లంబాడ సామాజిక వర్గానికి చెందిన దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్‌కు స్పీకర్ పదవి ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తోన్నట్టు సమాచారం. రంగారెడ్డి జిల్లా నుంచి తనకు మంత్రివర్గంలో స్థానం కల్పించాలని ప్రసాద్‌కుమార్ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీని కూడా కలిసి వచ్చారు. ప్రసాద్‌కుమార్‌ను స్పీకర్‌గా కొనసాగించే పక్షంలో బాలునాయక్‌కు డిప్యూటి స్పీకర్ పదవి ఇచ్చే అవకాశం లేకపోలేదని అంచనా వేస్తున్నారు. మూడు ఖాళీలలో ఒకటి బీసీకి, ఒకటి ఎస్టీకి, ఒకటి ఓసీకి కల్పించే పక్షంలో బీసీల నుంచి విప్ పదవిలో ఉన్న ఆదిశ్రీనివాస్, ఎస్టీల నుంచి బాలునాయక్, ఓసీల నుంచి రాజ్‌గోపాల్‌రెడ్డి/ సుదర్శన్‌రెడ్డి పేర్లు పరిశీలనలో ఉన్నట్టు తెలిసింది. మంత్రిపదవులతో కీలకమైన డిప్యూటి స్పీకర్, చీఫ్ విప్ పోస్టులను కూడా మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణతో పాటు భర్తీ చేయనున్నారని పార్టీ వర్గాల సమాచారం.
కాగా కొండా సురేఖ పద్మశాలి, ఆమె భర్త కొండా మురళి మున్నూరు కాపు సామాజికవర్గం. ఆమెను మంత్రివర్గం నుంచి తప్పించి మున్నూరుకాపు సామాజికవర్గానికి చెందిన ఆదిశ్రీనివాస్‌కు అవకాశం కల్పిస్తారని విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. కానీ ఇప్పటికే కరీంనగర్ జిల్లా నుంచి శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, ఆడ్లూరి లక్ష్మణ్ ముగ్గురు ప్రాతినిధ్యం వహిస్తుండటంతో అదే జిల్లాకు చెందిన ఆదిశ్రీనివాస్‌కు అవకాశం కల్పించడం ఒకటే ప్రతిబంధకంగా మారినట్లు తెలిసింది. ఇదే సమస్య రాజ్‌గోపాల్‌రెడ్డికి, బాలునాయక్‌కు అవకాశం కల్పించే విషయంలో కూడా ఎదురువుతున్నట్టు చెబుతున్నారు. నల్లగొండ జిల్లా నుంచి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఇద్దరు ప్రతినిధ్యం వహిస్తుండటంతో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి స్పీకర్ పదవి కట్టబెట్టి ఆయన స్థానంలో రాజ్‌గోపాల్‌రెడ్డికి మంత్రిపదవి, బాలునాయక్ డిప్యూటీ స్పీకర్ పదవి ఇచ్చే అవకాశాలపై కసరత్తు జరిగినట్లు తెలిసింది. ఈ ఫార్మూలాకు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ని ఒప్పించేందుకు సీఎం రేవంత్‌రెడ్డి తన సన్నిహితులను రంగంలోకి దింపినట్లు తెలిసింది. అందుకు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అంగీకరించినట్లు అయితే ఆదిశ్రీనివాస్, కోమటిరెడ్డి రాజ్‌గోపాల్‌రెడ్డి, గడ్డం ప్రసాద్‌కుమార్, బాలునాయక్ మంత్రులుగా, డిప్యూటీ స్పీకర్‌గాఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందిన మల్‌రెడ్డి రంగారెడ్డికి అవకాశం దక్కవచ్చని పార్టీ వర్గాల అంచనా వేస్తున్నాయి.











