
బిసిలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ కామారెడ్డి జిల్లా కేంద్రంలో రైల్ రోకో చేసిన తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) చీఫ్ కల్వకుంట్ల కవితపై రైల్వే చట్టం కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. రైల్ రోకో కేసులో బుధవారం ఉదయం 10.30 గంటలకు సికింద్రాబాద్లోని సెకండ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ కోర్టులో హాజరుకావాలని హాజరు కావాలని సమన్లు జారీ చేశారు. 2025 నవంబర్ 28న కామారెడ్డి జిల్లా కేంద్రంలో కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో రైల్ రోకో చేపట్టారు. కల్వకుంట్ల కవితతో పాటు టిఆర్ఎస్ నాయకులు చేపట్టిన రైల్ రోకో కారణంగా సిర్నపల్లి- ఇందల్వాయి రైల్వే స్టేషన్ల మధ్య నిజామాబాద్ నుంచి హైదరాబాద్కు వెళ్తున్న దేవగిరి ఎక్స్ ప్రెస్ ను నిలిపివేశారు.
అలాగే హైదరాబాద్ నుంచి నిజామాబాద్ రూట్లో ప్రయాణిస్తున్న మరో గూడ్స్ రైలును నిలిపివేశారు. రైల్ రోకో చేపట్టిన కల్వకుంట్ల కవితతో పాటు మరో 12 మంది నాయకులపై కామారెడ్డి రైల్వే ఏఎస్ఐ రవీంద్ర బాబు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు ఆధారంగా కవితతో పాటు 12 మంది టీఆర్ఎస్ నాయకులపై రైల్వే చట్టం కింద 147, 74(ఎ) సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈ కేసులో విచారణకు హాజరుకావాలని సికింద్రాబాద్ రైల్వేస్ సెకండ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాసెస్ కోర్టు జారీ చేసిన సమన్లలో పేర్కొన్నారు.













