
అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ బుధవారం నుంచి మూడు రోజుల పాటు చైనాలో పర్యటించనున్నారు. ప్రస్తుత ప్రపంచ స్థాయి ఉద్రిక్తతల దశలో ట్రంప్ చైనా సందర్శన కీలక పరిణామం అయింది. ఈ నెల 13 న ట్రంప్ చైనాకు వస్తున్నారని అధికార వర్గాలు నిర్థారించాయి,. పది సంవత్సరాల వ్యవధి తరువాత ట్రంప్ తాము తరచూ తగవుకు దిగే చైనాకు వస్తున్నారు. మూడు టి లు టెహ్రాన్, తైవాన్, ట్రేడ్ అంశాలతో వచ్చే ట్రంప్ బీజింగ్‌లో చైనా అధినేత జి జిన్‌పింగ్‌తో ముఖాముఖీ సమావేశం కానున్నారు. జిన్‌పింగ్‌ను ట్రంప్ ఇటీవలే గుడ్ , స్మార్ట్ అని పొగిడారు. తనకు చైనా నేతతో మంచి సంబందాలు ఉన్నాయని తెలిపారు. చైనాతో ఆదరణీయ వ్యాఖ్యలతో ట్రంప్ జిన్‌పింగ్‌తో శిఖరాగ్ర సదస్సుకు దిగుతారు. ట్రంప్ ఇటీవలి కాలంలో తమ సైనిక ఆర్థిక చర్యలతో ప్రపంచ వ్యాప్తంగా
దౌత్యపరమైన తీవ్ర పరిణామాలను తీసుకువస్తున్న దశలో ట్రంప్ పర్యటనకు ప్రాదాన్యత ఏర్పడింది. ప్రత్యేకించి మధ్యప్రాచ్యంలో రగులుకున్న వాతావరణం ప్రస్తుతానికి సద్దుమణిగినా ఇప్పటికీ శాశ్వత శాంతి నెలకొనకపోవడం పలు ప్రశ్నలకు దారితీసింది. ట్రంప్, జిన్‌పింగ్ చర్చలలో ప్రధానంగా ప్రత్యేకించి ఇరాన్ వైఖరి ప్రస్తావనకు రానుంది. హర్మూజ్ రీ ఓపెన్, శాంతి ఒప్పందం ఖరారులో చైనా సహకారం కోసం చాలా రోజులుగా యత్నించినా ముందడుగు వేయలేకపోయారు. ఈ దశలోనే ఆయన చైనా పర్యటన సాగనుంది. ట్రంప్ చైనా పర్యటన ఇప్పుడు అంతర్జాతీయంగా ఆయన బలహీన పరిస్థితిని తెలియచేస్తుందని హాంగ్‌కాంగ్ యూనివర్శిటీలో చైనా పాలసీ విశ్లేషకులు అలెజండ్రో రెయెస్ వ్యాఖ్యానించారు. ఇప్పుడు చైనా అవసరం అమెరికాకు ఉంది. అమెరికా అవసరం చైనాకు లేదని విశ్లేషించారు.














