
చెన్నై: ఏఐఏడీఎంకే రెబల్ ఎమ్మెల్యేలుగా మారిన వేలుమణి, షణ్ముగంలకు పార్టీ అధినేత ఎడప్పాడి కె పళనిస్వామి వేటు వేశారు. అసెంబ్లీలో జరిగిన బలపరీక్ష సందర్భంగా తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌కు 25 మంది ఏఐఏడీఎంకే ఎమ్మెల్యేలు మద్దతు ప్రకటించారు. దీంతో విశ్వాస ఓటుపై పార్టీ ఆదేశాలను ధిక్కరించినందుకు బుధవారం పార్టీ నాయకులు వేలుమణి, షణ్ముగం, సి విజయభాస్కర్, నాతం ఆర్ విశ్వనాథన్‌తో సహా పలువురు ఇతర నాయకులనువారి పదవుల నుంచి తొలగించారు.
కాగా, తమిళనాడులో నాలుగు రోజుల క్రితం అధికారంలోకి వచ్చిన టీవీకే ప్రభుత్వం, బుధవారం అసెంబ్లీలో జరిగిన విశ్వాస ఓటును గెలుచుకుని తన మొదటి ప్రధాన పరీక్షను విజయవంతంగా అధిగమించింది. ఏఐఏడీఎంకేకు చెందిన 25 మంది రెబెల్ ఎమ్మెల్యేల మద్దతుతో ముఖ్యమంత్రి విజయ్ సభ విశ్వాసాన్ని పొందారు. మొత్తం 234 స్థానాలున్న అసెంబ్లీలో 59 మంది సభ్యులున్న ప్రతిపక్ష డీఎంకే నిరసన వ్యక్తం చేస్తూ వాకౌట్ చేసింది.














