
పాకిస్థాన్‌తో కుదుర్చుకున్న సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేస్తూ భారత్ తీసుకున్న నిర్ణయాన్ని రద్దు చేస్తూ హేగ్‌లోని శాశ్వత మధ్యవర్తిత్వ న్యాయస్థానం (పీసీఏ) సోమవారం ఇచ్చిన తీర్పును భారత్ తిరస్కరించింది. చట్టవిరుద్ధంగా ఏర్పాటైన ఈ న్యాయస్థానానికి ఎలాంటి అధికార పరిధీ లేదు అని స్పష్టం చేసింది. ఒప్పందాన్ని నిలిపివేస్తూ భారత్ తీసుకున్న నిర్ణయం ఇప్పటికీ అమల్లోనే ఉందని విదేశాంగ శాఖ తెలిపింది.జమ్మూకశ్మీర్‌లోని రాట్లే జలవిద్యుత్ ప్రాజెక్టులో కొన్ని నిర్మాణాలను చేపట్టకుండా న్యూఢిల్లీపై ఆంక్షలు విధిస్తూ మధ్యంతర చర్యలపై న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాన్ని కూడా భారత్ తిరస్కరించింది. సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేయాలన్న భారత్ నిర్ణయం యథాతథంగా అమల్లో ఉంది అని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. మధ్యవర్తిత్వ న్యాయస్థానం వెలువరించిన తీర్పులను భారత్ అంగీకరించబోదని స్పష్టం చేసింది.2025 ఏప్రిల్‌లో పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడికి ప్రతిస్పందనగా భారత్ పలు దౌత్య, ఆర్థిక చర్యలను ప్రకటించింది. అందులో భాగంగానే 1960లో కుదిరిన సింధు జలాల ఒప్పందాన్ని భారత్ నిలిపివేసింది.
పాకిస్థాన్‌కు చెందిన లష్కరే తోయిబా (ఎల్‌ఈటీ)కు చెందిన ఓ అనుబంధ సంస్థ ఈ దాడికి పాల్పడినట్లు భారత్ పేర్కొంది. సరిహద్దు నదుల నీటిలో తమ వాటాను భారత్ నిరాకరిస్తే దానిని యుద్ధ చర్యగా పరిగణిస్తామని పాకిస్థాన్ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ఒప్పందం పరిస్థితిపై నిర్ణయం తీసుకోవాలంటూ ఈ ఏడాది మార్చిలో హేగ్‌లోని న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. అయితే ఈ మధ్యవర్తిత్వ న్యాయస్థానం చట్టవిరుద్ధంగా ఏర్పాటైంది అని భారత విదేశాంగ శాఖ తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రపంచ బ్యాంకు ఒప్పందంలోని నిబంధనలను స్పష్టంగా ఉల్లంఘిస్తూ ఈ న్యాయస్థానాన్ని ఏర్పాటు చేసిందని పేర్కొంది. గతంలో ఈ సంస్థ ఇచ్చిన తీర్పులను ఎలా తిరస్కరించిందో,తాజా తీర్పును కూడా అలాగే తిరస్కరిస్తున్నట్లు తెలిపింది. ఈ న్యాయస్థానం ఉనికిని భారత్ ఎన్నడూ చట్టబద్ధంగా గుర్తించలేదని, మధ్యవర్తిత్వ సంస్థను ఏర్పాటు చేయడమే సింధు జలాల ఒప్పందానికి తీవ్రమైన ఉల్లంఘన
అని మొదటి నుంచీ చెబుతున్నామని విదేశాంగ శాఖ పేర్కొంది. అందుకే ఈ సంస్థ ముందు భారత్ ఎప్పుడూ హాజరు కాలేదని, గతంలో అది ఇచ్చిన తీర్పులను కూడా పరిగణనలోకి తీసుకోలేదని తెలిపింది. భారత్ సార్వభౌమ నిర్ణయాలపై తీర్పులు ఇచ్చే అధికారం ఈ న్యాయస్థానానికి లేదు అని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. ప్రస్తుతం లేదా భవిష్యత్తులో ఈ సంస్థ చేసే ప్రకటనలు, తీర్పులు భారత్ చేపడుతున్న ప్రాజెక్టులకు సంబంధించి తన చర్యలపై ఎలాంటి ప్రభావం చూపబోవని పేర్కొంది.ఒప్పందాన్ని నిలిపివేసిన తర్వాత జమ్మూకశ్మీర్‌లో పలు జలవిద్యుత్ ప్రాజెక్టుల పనులను భారత్ వేగవంతం చేసింది. 1960 ఒప్పందంలోని నిబంధనల కింద పాకిస్థాన్ అభ్యంతరం వ్యక్తం చేసిన రాట్లే, కిషన్‌గంగా ప్రాజెక్టులు వీటిలో ఉన్నాయి. ఈ రెండు ప్రాజెక్టులపై మధ్యవర్తిత్వ న్యాయస్థానాన్ని ఏర్పాటు చేయాలని పాకిస్థాన్ గతంలో కోరింది.
ఒప్పందం పూర్తిగా అమల్లోనే ఉందన్న పీసీఏ
మరోవైపు శాశ్వత మధ్యవర్తిత్వ న్యాయస్థానం ప్రకారం.. సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేస్తున్నట్లు భారత్ తీసుకున్న నిర్ణయానికి అర్థమేంటన్న అంశాన్ని పరిశీలించింది. ఈ నిర్ణయం ఒప్పందం నిలిపివేయబడిందా లేదా రద్దయిందా అన్న దావాగా మాత్రమే పరిగణించగలమని తెలిపింది. ఒప్పందాన్ని నిలిపివేయడానికి లేదా రద్దు చేయడానికి భారత్ చూపించిన కారణాలను, న్యూఢిల్లీ బహిరంగంగా వెల్లడించిన అంశాలను కూడా న్యాయస్థానం పరిశీలించింది. అయితే ఆ కారణాల్లో ఏదీ ఒప్పందాన్ని నిలిపివేయడానికి లేదా రద్దు చేయడానికి సమర్థన కాదని ఏకగ్రీవంగా తీర్పు ఇచ్చింది.
అందువల్ల సింధు జలాల ఒప్పందం పూర్తిగా అమల్లోనే ఉందని, పశ్చిమ నదులపై భారత్ చేపడుతున్న జలవిద్యుత్ ప్రాజెక్టుల రూపకల్పన, నిర్వహణకు సంబంధించిన నిబంధనలతో సహా ఒప్పందంలోని బాధ్యతలను భారత్ పాటించాల్సి ఉంటుందని పీసీఏ పేర్కొంది. ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వంతో కుదిరిన ఈ ఒప్పందం ప్రకారం సింధు, జీలం, చీనాబ్ నదులను పశ్చిమ నదులుగా పాకిస్థాన్‌కు, రావి, బియాస్, సట్లెజ్ నదులను తూర్పు నదులుగా భారత్‌కు కేటాయించారు. అయితే మరో దేశానికి కేటాయించిన నదీ జలాలను కూడా కొన్ని పరిమిత ఉపయోగాలకు వినియోగించుకునే హక్కును ఇరు దేశాలకు ఒప్పందం కల్పించింది.
రాట్లే ప్రాజెక్టుపై మధ్యంతర ఆంక్షలు
రాట్లే జలవిద్యుత్ ప్రాజెక్టులో నిర్మాణ పనులను పరిమితం చేయాలన్న పాకిస్థాన్ విజ్ఞప్తిని కూడా పీసీఏ పరిశీలించింది. ప్రాజెక్టు రూపకల్పన ఒప్పందానికి అనుగుణంగా ఉందా లేదా అన్న అంశంపై తటస్థ నిపుణుడు నిర్ణయం తీసుకునే వరకు కొన్ని నిర్మాణ పనులను నిలిపివేయాలని పాకిస్థాన్ కోరింది. ఈ మేరకు రాట్లే జలవిద్యుత్ ప్రాజెక్టు ఆనకట్ట గోడ, విద్యుత్ నీటి ప్రవేశ నిర్మాణాలను నిర్దిష్ట స్థాయికి మించి కాంక్రీట్ చేయకుండా భారత్‌పై ఆంక్షలు విధించాలని న్యాయస్థానం ఏకగ్రీవంగా నిర్ణయించింది. తటస్థ నిపుణుడి తుది నిర్ణయం వెలువడిన తర్వాత 90 రోజుల వరకు ఈ ఆంక్షలు కొనసాగుతాయి.
ఈ నిర్ణయం 2027 జులైలో వెలువడే అవకాశం ఉందని పీసీఏ తెలిపింది. రాట్లే ప్రాజెక్టు నిర్మాణ షెడ్యూల్‌కు సంబంధించిన సమాచారాన్ని అందించాలని కూడా భారత్‌ను ఆదేశించింది. అయితే పాకిస్థాన్ కోరిన మరో రెండు మధ్యంతర చర్యలను మాత్రం న్యాయస్థానం తిరస్కరించింది. ప్రాజెక్టులోని కొన్ని నిర్మాణాలను భవిష్యత్తులో తొలగించాల్సి, మార్చాల్సి వస్తే ఆ బాధ్యత భారత్‌దే కావాలని కోరిన విజ్ఞప్తి, న్యాయస్థానం తుది నిర్ణయం వెలువరించే వరకు ఒప్పందాన్ని పూర్తిగా పాటించే స్థితికి భారత్ తిరిగి రావాలన్న మరో విజ్ఞప్తిని తిరస్కరించింది.








