రాష్ట్ర ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల పేరుతో రూ.500 కోట్ల భారీ కుంభకోణానికి పాల్పడినట్లు మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తన్నీరు హరీశ్‌రావు ఆరోపించారు. వరంగల్ జిల్లా ఖానాపురం మండలం అశోక్‌నగర్‌లో ధ్వంసమైన మట్టికోట శివాలయాన్ని సోమవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన విలేఖరులతో మాట్లాడుతూ.. ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల పేరుతో రాష్ట్రవ్యాప్తంగా 76 స్కూళ్లు మంజూరుచేసి ఎక్సెస్ టెండర్లతో రూ.500 కోట్ల అవినీతికి రేవంత్ రెడ్డి పాల్పడిండన్నారు. టెండర్లు పిలిస్తే అన్నీ 4.86 శాతం, 4.96 శాతం, 4.99 శాతానికి ఎక్సెస్‌కే ఇచ్చారు. ఒక్క టెండర్ కూడా మైనస్ పోకుండా అన్ని ఎక్సెస్‌కే ఎలా పోయాయని, ఈ స్కూళ్ల టెండర్లలో ఏకంగా రూ.494.01 కోట్ల ఎక్సెస్ అమౌంట్ ద్వారా ప్రజా ధనం లూఠీ అయిందన్నారు. నర్సంపేట ప్యాకేజీ 8 కింద రూ.136 కోట్లకు టెండర్ ఉంటే అది రూ.142 కోట్లతో 4.86 శాతం ఎక్సెస్ ఇచ్చారన్నారు. తనకనుకూలంగా ఉండేందుకు ఒక రిటైర్డ్ అధికారిని చీఫ్ ఇంజినీర్‌గా పెట్టుకొని ఈ రూ.500 కోట్ల దోపిడీకి తెర తీశారన్నారు.

హ్యామ్ రోడ్లలో టెండర్లు దక్కించుకున్నవారు నా మనుషులని సీఎం రేవంత్‌రెడ్డి ఆరోపిస్తున్నారని వారు నా మనుషులైతే వెంటనే ఆ టెండర్లు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. హ్యామ్ రోడ్ల పేరుతో ఆర్ అండ్ బీ, పంచాయతీరాజ్ శాఖల్లో 25 శాతం ఎక్సెస్‌తో జరిగిన రూ.5000 కోట్ల కుంభకోణాన్ని బయటపెట్టి పోరాటం చేసింది నేనే అన్నారు. అవి నీ మనుషులా.. నా మనుషులా అన్నది కాదు. అది రాష్ట్ర ప్రజల చెమట చుక్కల ఆదాయం అన్నారు. బీఆర్‌ఎస్ హయాంలో ఎన్నడూ 5 శాతానికి మించి టెండర్లు ఇవ్వలేదని, మొబిలైజేషన్ అడ్వాన్స్ రద్దుచేసి వెంటనే ప్రజాధనం లూటీని ఆపాలని డిమాండ్ చేశారు. కాకతీయుల కాలం నాటి 800 ఏళ్ల చరిత్ర కలిగిన అద్భుతమైన శివాలయం గర్భ గుడి కింద గుప్త నిధుల వేటలో భాగంగానే రేవంత్‌రెడ్డి డైరెక్షన్‌లో తవ్వకాలు జరిపారన్నారు. ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం మంజూరు ఒక దగ్గరైతే ఉద్దేశపూర్వకంగానే అశోక్‌నగర్‌లో పాఠశాల నిర్మాణం పేరుతో గుప్త నిధుల కోసం రాత్రి 12 నుంచి 1 గంటల మధ్య చీకట్లో గర్భగుడి కింద ఏకంగా 20 అడుగుల లోతు గుంత తవ్వారని సాక్షాత్తు పురావస్తు శాఖ జిల్లా అధికారి బుజ్జి ఈ నెల 7న కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినట్లు హరీశ్‌రావు తెలిపారు.

రాష్ట్రంలో బడులు, గుడులను సీఎం రేవంత్‌రెడ్డి ధ్వంసం చేస్తున్నారని ఆరోపించారు. పాఠశాల నిర్మాణానికి తాము వ్యతిరేకం కాదని వెంటనే రాష్ట్ర ప్రభుత్వం పురావస్తు శాఖ ఇచ్చిన ఫిర్యాదు మేరకు గుప్త నిధులను తవ్విన కాంట్రాక్టర్‌పై కేసు నమోదు చేసి యంత్రాలను సీజ్ చేయాలని దొరికిన గుప్త నిధులను బయటపెట్టాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి, మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్, మాజీ ఎమ్మెల్యేలు శంకర్‌నాయక్, ఆరూరి రమేశ్, మాజీ కార్పొరేషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ ఉన్నారు.