
మన తెలంగాణ/హైదరాబాద్: సొమ్ము ఒకరిది.. సోకు మరొకరిదిలా స్మార్ట్ రేషన్ కార్డులపై ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఫొటోలు పెట్టుకున్నారని కేంద్ర హోం శాఖ సహా య మంత్రి బండి సంజయ్ విమర్శించారు. ప్రధాని నరేంద్ర మోడీ బియ్యం ఇస్తున్నందున అవి వద్దని కేంద్రానికి లేఖ రాయగలరా? అని ఆయన రాష్ర సిఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. శనివారం నాంపల్లిలోని పార్టీ కార్యాలయంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. అనంతరం కేంద్ర మంత్రి బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ కర్నాటకలో సిద్ది రామయ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వందల కోట్లతో స్మార్ట్ కార్డులు తయారు చేశారని, ఇప్పుడు డికె శివకుమార్ ముఖ్యమంత్రి కావడంతో ఆ కార్డులన్నీ నిరుపయోగమయ్యాయని ఆయన తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం తుమ్మితే ఊడి పోయే ముక్కులా ఉన్నదని ఆయన విమర్శించారు. రేషన్ బియ్యం ఉచితంగా ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వమే ఇస్తున్నప్పుడు ప్రధాని పొటో ఎందుకు పెట్టలేదని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో 57 లక్షల కార్డుదారులకు దాదాపు 2 కోట్ల మంది ఉచితంగా బియ్యం కేంద్రం ఇస్తోందని ఆయన తెలిపారు. కేంద్రం ఇచ్చే బియ్యం మీకు అవసరం లేదా?, దమ్ముంటే ప్రధాని మోడీ ఇస్తున్న బియ్యం అవసరం లేదని కేంద్రానికి లేఖ రాసే దమ్ముందా? అని ఆయన ప్రశ్నించారు. గతంలో బిఆర్‌ఎస్ పాలనలోనూ ఇదే పరిస్థితి ఉండేదన్నారు. పంచాయతీల అభివ్రుద్ధికి కేంద్రం నిధులిస్తే, బిఆర్‌ఎస్ డ్రామాలాడిందని ఆయన తూర్పారపట్టారు. పీఎంఏవై ఇండ్లు ఇస్తే తామే ఇచ్చామని గొప్పలు చెప్పుకుంటున్నారని ఆయన విమర్శించారు. పైగా కేంద్రం ఏమీ ఇవ్వడం లేదని కాంగ్రెస్ నేతలు, మంత్రులు ఎదురు దాడి చేస్తున్నారని ఆయన తెలిపారు.
బిఆర్‌ఎస్ తరహాలోనే&
బిఆర్‌ఎస్ తరహాలోనే కాంగ్రెస్ పాలన కొనసాగుతోందని కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శించారు. తెలంగాణ జనాభా 3.5 కోట్లుంటే, 3 కోట్ల 43 లక్షల మందికి ఉచితంగా బియ్యం ఇస్తారా? అని ఆయన ప్రశ్నించారు. తెలంగాణలో 30 లక్షల మంది ఇన్ కం ట్యాక్స్ ఫైల్ చేస్తున్నారు కదా, వాళ్లకు కూడా బియ్యం ఇస్తున్నారా? అని ఆయన ప్రశ్నించారు. 22ఏ నిషేధిత జాబితా పేరుతో మహాదోపిడీ కొనసాగుతోందని ఆయన విమర్శించారు. ఏనుగులు మింగేటోడు పోయి పీనుగలు మింగేటోడు వచ్చాడని ఆయన తూర్పారపట్టారు. రాష్ట్రంలో మొత్తం 2 కోట్ల 77 లక్షల ఎకరాలుంటే ఏకంగా 95 లక్షల ఎకరాల భూములను నిషేధిత జాబితాలో పెడతారా? అని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వం అమ్మిన భూములను, హెచ్‌ఎండీఏ వేలం వేసిన భూములను, ప్రజలు కష్టపడి డబ్బులు చెల్లించి కొనుక్కున్న భూములను, పరిశ్రమలకు అమ్మిన భూములను కూడా 22ఏలో పెడతారా? అని ఆయన ప్రశ్నించారు. ఫీజుల బకాయిలే విడుదల చేయలేదని, వచ్చే ఏడాది నుండి అడ్వాన్స్‌గా జమ చేస్తామంటే నమ్మేదెలా? అన్నారు. బిఆర్‌ఎస్ పాలనలో ఒక కుటుంబమే దోచుకుంటే, కాంగ్రెస్ పాలనలో ఎమ్మెల్యేలు, మంత్రులు, సీఎంతోపాటు ఢిల్లీ పెద్దలకు కూడా దోచి పెడుతున్నారని ఆయన దుయ్యబట్టారు.
భాగ్యలక్ష్మిఆలయం వద్ద లక్షలాది మందితో వందేమాతరం గీతాలాపన
పాతనగరంలోని చార్మినార్ భాగ్యలక్ష్మీ ఆలయం వద్ద లక్షలాది మందితో వందేమాతరం గీతాలాపన చేయిస్తానని, మజ్లిస్ నేతలకు దమ్ముంటే అడ్డుకోవాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ సవాల్ విసిరారు. మజ్లిస్ నేతలు చెవుల్లో దూది పెట్టుకున్నా విన్పించేలా వందేమాతరం గీతాలాపన చేస్తామన్నారు. వందేమాతరం గీతాన్ని అవమానిస్తే 3 ఏళ్ల జైలు శిక్ష, జరిమానా తప్పదు అని ఆయన హెచ్చరించారు. ఇకపై వందేమాతారాన్ని అవమానించే వాళ్లంతా దేశ్ర ద్రోహులేనని ఆయన అన్నారు. చట్ట ప్రకారం వ్యవహరించే తమను మతతత్వవాదులంటారా? అని ఆయన ప్రశ్నించారు. ఎర్రకోటపై కోటి మంది యువతకు ఏఐ శిక్షణ ఇస్తామని ప్రధాని ప్రకటించడం హర్షణీయం అని అన్నారు. పోటీ పరీక్షల కోసం ఉచిత ఆన్ లైన్ కోచింగ్ అందిస్తామని చెప్పడం అభినందనీయం అని ఆయన తెలిపారు. రాష్ట్ర యువత పక్షాన ప్రధాని మోడీకి ధన్యవాదాలు చెబుతున్నానని అన్నారు. రోజ్ గార్ మేళా పేరిట 12 లక్షల ఉద్యోగాలను భర్తీ చేసిన ఘనత ప్రధాని మోడీదేనని కేంద్ర మంత్రి బండి సంజయ్ తెలిపారు.








