
తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ సోమవారంనాడు అనూహ్యంగా మాజీ సిఎం స్టాలిన్ నివాసానికి వెళ్లారు. సోమవారంనాడు ఇక్కడి అళ్వారుపేటలోని ఆయన నివాసానికి వెళ్లి మర్యాదపూర్వకంగా కలిశారు. కొద్ది నిమిషాల పాటు స్టాలిన్‌తో విజయ్ భేటీ కావడం తమిళనాడులో చర్చనీయాంశంగా మారింది. ఈ సందర్భంగా సిఎం విజయ్‌ను స్టాలిన్ తన నివాసంలోకి సాదరంగా ఆహ్వానించారు. శాలువా కప్పి సన్మానించారు. ఈ సందర్భంగా స్టాలిన్ కుమారుడు ఉదయనిధి కూడా అక్కడే ఉన్నారు. వీరిద్దరూ ఏమి మాట్లాడుకున్నారనే విషయం బయటకు రాలేదు.
గత ఐదేళ్లు తమిళనాడు ముఖ్యమంత్రిగా పని చేసిన స్టాలిన్ తాజా ఎన్నికల్లో ఓటమి చవిచూసిన సంగతి తెలిసిందే. ఎన్నికల్లో టివికె అత్యధిక స్థానాలతో అతిపెద్ద పార్టీగా అవతరించిన సంగతి తెలిసిందే. అయితే ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన బలం టివికెకు దక్కలేదు. దీంతో డిఎంకె మిత్ర పక్షాలైన కాంగ్రెస్, వామపక్షాలు, విసికె, ఐయూఎంఎల్ మద్దతు ప్రకటించడంతో విజయ్ సిఎం అయ్యారు. ఈ నేపథ్యంలో స్టాలిన్‌ను విజయ్ కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇది మర్యాదపూర్వక భేటీ మాత్రమే అని టివికె ప్రతినిధులు వెల్లడించారు. అనంతరం విజయ్ ఎండిఎంకె నేత వైగోను కూడా కలిశారు.















