
సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో జరిగిన భారీ బహిరంగ సభలో పాల్గొన్న ప్రజల ఉత్సాహం తెలంగాణలో రాజకీయ మార్పునకు నాంది పలుకుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు పేర్కొన్నారు. సభా ప్రాంగణంలో ఉన్న ప్రజలకంటే రెట్టింపు సంఖ్యలో ప్రజలు బయట ఉన్నారని, ఇది ప్రజల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పట్ల ఉన్న అపారమైన అభిమానానికి నిదర్శనమన్నారు. మూడోసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా తెలంగాణకు వచ్చిన ప్రధానికి రాష్ట్ర ప్రజలు ఇచ్చిన అద్భుత స్వాగతానికి కొనియాడారు.
ప్రధాని నరేంద్ర మోడీకి తెలంగాణతో ప్రత్యేకమైన అనుబంధం ఉందని అన్నారు. హైదరాబాద్ రాష్ట్రం నిజాం పాలన నుంచి భారతదేశంలో విలీనమైన చారిత్రాత్మకమైన సెప్టెంబర్ 17నే మోడీ జన్మదినం కూడా కావడం తెలంగాణ ప్రజలకు మరింత గొప్ప భావోద్వేగ అనుబంధాన్ని కలిగిస్తోందని రాంచంద్రరావు పేర్కొన్నారు. తెలంగాణతో పాటు దేశ అభివృద్ధికి దోహదపడే రూ.9,700 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను ప్రధాని మోడీ దేశానికి అంకితం చేయడం పట్ల భారతీయ జనతా పార్టీ తెలంగాణ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని అన్నారు.
తెలంగాణలో ప్రస్తుతం జరుగుతున్న పోరాటం జాతిని విభజించే శక్తులపై పోరాటమని ఆయన స్పష్టం చేశారు. ఒకప్పుడు దేశాన్ని నక్సలిజం, లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం వంటి శక్తులు భయపెట్టాయని, కానీ ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశం నక్సలైట్ ముక్త్ భారత్, లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం ముక్త్ భారత్ దిశగా ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. దీనికి పూర్తి ఘనత ప్రధాని మోడీకే చెందుతుందని అన్నారు. దక్షిణాది -ఉత్తరాది పేరుతో దేశాన్ని విభజించే రాజకీయ శక్తులతో పాటు కుటుంబ పాలన పేరుతో దేశాన్ని, రాష్ట్రాన్ని దోచుకుంటున్న కాంగ్రెస్ వంటి పార్టీలకు వ్యతిరేకంగా బీజేపీ పోరాటం కొనసాగిస్తోందని స్పష్టం చేశారు.















