
సుక్కపొద్దున్న మా అమ్మ సక్కంగ పొయ్యికాడ
ఇంటిల్లిపాదికి ఊపిరులూదేది
బతుకు పోరుకు మా అయ్య మెత్తంగ
కొడవలి గొడ్డలి నూరెటోడు
కడవలో అంబలి కడుపులోసుకొని
గుడ్డలో సంకటి మూటకట్టుకొని
బయలుదేరేది పల్లె బతుకుదెరువుకు
చెట్టు పుట్టలను మదిలో మొక్కుకుంటూ
సల్లని వెన్నెల వెలుతురే
దారిన పరిచిన తెల్లని తివాచీ
వడివడిగా వేసిన అడుగులే
మా సంకటి ముద్దలకు దిక్సూచి
ఆకాసం ఎర్రబడక ముందే
మా అమ్మయ్య చేతులు ఎరుపెక్కేవి
తునికాకు సంచులు నిండితే
వాళ్ల కడుపు నిండిన ఆనందం
ఇసుక దిబ్బల మీద బంతి భోజనం
చెలిమె నీళ్లతో దోసిళ్ళ స్నేహం
అంబటాల్లకు తిరుగు పయనం
మా అందరికీ ఎనలేనిసంబురం
అలిసిసొలిసినతనువులకు
తుంకాకు సంచులే దూదిపాన్పులు
- గుంటి.తిరుపతి














