
హైదరాబాద్: తెలంగాణ ఉద్యమకారుల కుటుంబాలకు న్యాయం చేస్తున్నామని టిపిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసమే తెలంగాణ ప్రజలు పోరాడి స్వరాష్ట్రం సాధించుకున్నారు కానీ, తెలంగాణ వచ్చాక నిధులు, నియామకాలు కేవలం మాజీ సిఎం కెసిఆర్ కుటుంబానికి దక్కాయని అన్నారు. ఇందిరాపార్క్ వద్ద పిసిసి ఆధ్వర్యంలో మహాధర్నా జరిగింది. ఎమ్మెల్యే పదవికి కెసిఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. జీతభత్యాలు తీసుకుంటున్న కెసిఆర్ అసెంబ్లీకి రావట్లేదని కాంగ్రెస్ విమర్శలు చేసింది. కెసిఆర్ ప్రజాధనం ఖర్చు చేస్తూ..ప్రజలకు దూరంగా ఉంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సొంతిళ్లు కట్టుకోవాలనే పేదల కల..పదేళ్ల పాటు నెరవేరలేదని విమర్శించారు. ప్రతి నియోజకవర్గానికి 2,500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తున్నామని, అర్హులైన ప్రతి పేదవాడికి ఇల్లు నిర్మించి ఇవ్వడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని మహేష్ గౌడ్ తెలియజేశారు.
ఆర్థిక సమస్యలు ఉన్నప్పటికీ..సంక్షేమాన్ని కొనసాగిస్తున్నామని, ప్రభుత్వ విద్య, వైద్యరంగాన్ని బలోపేతం చేస్తున్నామని మహేష్ గౌడ్ పేర్కొన్నారు. ఉన్నత చదువులు చదివితే సరిపోదని సంస్కారం కూడా ఉండాలనేది బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ గ్రహించాలని సూచించారు. ప్రజలు ఇచ్చిన ప్రతిపక్ష హోదాకు కెసిఆర్ న్యాయం చేయాలని, ప్రజలు ఇచ్చిన తీర్పును అపహాస్యం చేయొద్దు అని సూచించారు. ప్రజలు ప్రతిపక్ష పాత్ర ఇస్తే..కెసిఆర్ ఫామ్ హౌస్ కే పరిమితం అయ్యారని, ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష నేత పాత్రకు కూడా ఎంతో ప్రాధాన్యత ఉందని మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు.








