
వారం రోజులపాటు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిరసనలు
తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్
మన తెలంగాణ/మోత్కూర్: అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో ఇచ్చిన హామీలు అమలు చేస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజులైనా ఆ హామీలను అమలు చేయడం లేదని తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ విమర్శించారు. మోత్కూరు మండలం దాచారం గ్రామంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారుల మారి రాష్ట్రంలో భూములు కొల్లగొడుతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో సుమారు కోటి 16 లక్షల ఎకరాల భూములను కాంగ్రెస్ ప్రభుత్వం 22ఎ లో చేర్చి ప్రజలు రైతుల, ఉసురు పోసుకుంటుందని విమర్శించారు. మున్సిపల్ ఎన్నికల సమయంలోనే 22ఏ సమస్యపై మొదటగా తానే మాట్లాడానని, ఇప్పుడు దాంతో తలెత్తుతుండడంతో సీఎం రేవంత్ రెడ్డి మంత్రి పొంగులేటి తమ తప్పేం లేదన్నట్టుగా అధికారులపై తోసేస్తున్నారని తెలిపారు. జీవో 97 తెచ్చి పాలిటెక్నిక్ విద్యను సర్వ నాశనం చేసాడని, పాలిటెక్నిక్ విద్యార్థులు బీటెక్ లోకి వెళ్లకుండా నిషేధం విధించారన్నారు. ఫ్యూచర్ సిటీ నిర్మిస్తానని రేవంత్ రెడ్డి పొంకనాలు పడుతున్నాడని, ఫ్యూచర్ సిటీ పేరుతో రేవంత్ రెడ్డి నలుగురు అన్నదమ్ములు దొంగల మారి అందిన కాడికి భూములు దోచుకుంటున్నారని ఆరోపించారు. దోసుకున్న భూములకు రేట్లు పెరగడానికి సీఎం రేవంత్ రెడ్డి బుల్లెట్ ట్రైన్ రూట్ కూడా ఫ్యూచర్ సిటీ మీదుగా మళ్ళించాడని తెలిపారు. శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టు నుంచి ఏపీ జలదోపిడి చేస్తున్నా రేవంత్ రెడ్డి కల్లప్పగించి చూస్తున్నాడని గాదరి కిషోర్ మండిపడ్డారు.

రేవంత్ రెడ్డి చంద్రబాబుతో కలిసి రాష్ట్ర రైతాంగానికి మరణ శాసనం రాస్తున్నాడన్నారు. చదువురానోడు అమెరికాకు పోయి ఏం చర్చలు జరుపుతాడని, తన పదవిని కాపాడుకోవడానికి రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ సహాదారుడు శ్యామ్ ప్రిటోడాను అమెరికాలో కలిసేందుకు ప్రయత్నించగా ఆయన కలవకపోవడంతో అమెరికా పర్యటన రద్దు చేసుకున్నాడని, కుర్చీ పోతుందని ఇక్కడికి వచ్చి సెంటిమెంట్ డైలాగులు కొడుతున్నాడని విమర్శించారు. కాంగ్రెస్ మళ్లీ ప్రజలు, రైతులు ఓట్లేసే పరిస్థితి లేదన్నారు.
వచ్చే 2 నుంచి వారం రోజులు నిరసనలు
ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 2 నుంచి వారం రోజుల పాటు నిరసన కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. సెప్టెంబర్ 2న తుంగతుర్తిలో నియోజకవర్గ స్థాయి నిరసన ధర్నా, 3న మిర్యాలగూడలో వ్యవసాయం, కృష్ణా జలాల అంశాలపై నిర్వహించే సభలో బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొంటారని చెప్పారు. 4న వికలాంగులు, వృద్దులకు ఇచ్చిన హామీలపై తిరుమలగిరిలో నిరసనలో తాను పాల్గొంటానని, 7న మండల కేంద్రాల్లో ప్రభుత్వ మోసాలపై మండల కేంద్రాల్లో ప్రజావాణిలో వినతిపత్రాలు అందజేత, మోత్కూర్ లో జరిగే నిరసనలో తాను పాల్గొంటానని చెప్పారు. కార్యక్రమాల్లో పార్టీ శ్రేణులు పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు. బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నేవూరి ధర్మేందర్ రెడ్డి, తిరుమలగిరి మున్సిపల్ చైర్మన్ సంకేపల్లి రఘునందన్ రెడ్డి, బిఆర్ఎస్ మండల అధ్యక్షులు ఉప్పలయ్య, సోమేశ్ గౌడ్, సీతయ్య, మల్లయ్య, రజాక్, కొమ్మిడి ప్రభాకర్ రెడ్డి, మదర్ డెయిరీ డైరెక్టర్ రచ్చ లక్ష్మీనరసింహారెడ్డి, మార్కెట్ మాజీ చైర్మన్లు చిప్పలపల్లి మహేంద్రనాథ్, కొణతం యాకూ బ్ రెడ్డి, తీపిరెడ్డి మేఘారెడ్డి , జంగ శ్రీను, నల్ల మధు, దాసరి తిరుమలేష్, పొన్నాల వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.








