
న్యూఢిల్లీ: వైవిధ్యంలో ఏకత్వం భారత్ డీఎన్‌ఏలోనే ఉందంటూ అమెరికాలో ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలపై రాజ్యసభ సభ్యుడు కపిల్ సిబల్ విమర్శలు గుప్పించారు. మాటల కంటే చేతలే ముఖ్యమని వ్యాఖ్యానిస్తూ.. ఈ అంశంపై భగవత్ విదేశాల్లో మాట్లాడిన తీరుకు, స్వదేశంలో ఆయన మౌనం వహిస్తున్న తీరుకు పొంతన లేదని అన్నారు.
శనివారం న్యూయార్క్‌లోని మాడిసన్ స్క్వేర్ గార్డెన్‌లోని ఇన్ఫోసిస్ థియేటర్‌లో నిర్వహించిన కార్యక్రమంలో 6,000 మందికి పైగా భారతీయ-అమెరికన్లు, వివిధ మతాల నాయకులను ఉద్దేశించి భగవత్ ప్రసంగించారు. వైవిధ్యాన్ని గౌరవించాలని, దాన్ని ఆమోదించి వేడుక జరుపుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. వైవిధ్యంలో ఏకత్వం భారత్ అస్తిత్వంలోనే భాగమని పేర్కొన్నారు. భగవత్ ప్రసంగంపై స్పందించిన సిబల్ ‘ఎక్స్’లో.. ‘న్యూయార్క్‌లో భగవత్: వైవిధ్యం మన సహజమైన ఏకత్వానికి అలంకారం. దాన్ని కాపాడుకోవాలి. విదేశాల్లో గొప్ప మాటలు.. స్వదేశంలో మౌనం. మాటలకు ప్రాధాన్యం లేదు.. చేతలే మాట్లాడాలి!’ అని వ్యాఖ్యానించారు. విదేశాల్లో భగవత్ చేసిన వ్యాఖ్యలు గొప్ప మాటలుగా ఉన్నప్పటికీ.. దేశంలో మాత్రం ఈ అంశంపై మౌనం కనిపిస్తోందని అన్నారు.
అమెరికన్ హిందూస్ ఫర్ ఎంగేజ్‌మెంట్ అండ్ డైలాగ్ (ఏహెచ్‌ఈడీ) వేదిక నిర్వహించిన ‘యూనివర్సల్ వన్‌నెస్ సెలబ్రేషన్’లో భగవత్ మాట్లాడుతూ.. ‘అమెరికా, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అని చెప్పినప్పుడు తరచుగా చర్చకు వచ్చే పదం బహుళత్వం. భారత్ అని చెప్పినప్పుడు మరో భావన గురించి మాట్లాడతాం.. అదే వైవిధ్యంలో ఏకత్వం’ అని అన్నారు. దీంతో సభికులు చప్పట్లతో హర్షం వ్యక్తం చేశారు. ఏకత్వం, వైవిధ్యం రెండూ భారత్ డీఎన్‌ఏలోనే ఉన్నాయని భగవత్ అన్నారు. ప్రతి దేశానికీ సాధించాల్సిన ఒక లక్ష్యం, నెరవేర్చాల్సిన ఒక విధి ఉంటుందని స్వామి వివేకానంద చెప్పిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. ‘భారత్‌కు నిర్దేశించిన లక్ష్యం ఏమిటి? ఈ వైవిధ్యంలో ఏకత్వాన్ని సాకారం చేయడం, ఎప్పటికప్పుడు ప్రపంచానికి కూడా దాని ప్రాముఖ్యతను తెలియజేయడమే భారత్ లక్ష్యం. మనమంతా ఒక్కటే. ఈ వైవిధ్యం కారణంగా ఆ ఏకత్వం మరింత అందంగా కనిపిస్తుంది’ అని భగవత్ అన్నారు.
దాదాపు గంటపాటు సాగిన ప్రసంగంలో ఆయన మాట్లాడుతూ.. వైవిధ్యాన్ని గౌరవించాలి, ఆమోదించాలి, వేడుక జరుపుకోవాలి. అదే సమయంలో మనలోని ఏకత్వ భావనను కూడా గుర్తుంచుకోవాలి. ఇది ఎంతో వాస్తవమైన భావన అని పేర్కొన్నారు.








