ఎస్‌సి, ఎస్‌టి, బిసి బిడ్డల ఉన్నత విద్యను రాష్ట్ర ప్రభుత్వం గొంతు నులుముతోందని డాక్టర్ కె. లక్ష్మణ్ తూర్పారపట్టారు. విద్యార్థులను ‘క్రిమినల్ వేస్ట్’ అన్న సీఎం రేవంత్‌కు వారి ఉసురు తగలక తప్పదని ఆయన హెచ్చరించారు. రూ. 15,000 కోట్ల ఫీజు బకాయిలు చెల్లించే వరకు పోరాటం ఆగదని ఆయన తెలిపారు. నిధుల లేమితో ప్రైవేట్ విద్యా సంస్థలు మూత పడుతుంటే, అధ్యాపకులు రోడ్డున పడుతుంటే ప్రభుత్వానికి కనీస బాధ్యత లేకుండా పోయిందని విమర్శించారు. ఎన్నికల సమయంలో అశోక్ నగర్ రోడ్లలో రాహుల్ గాంధీ నిరుద్యోగులను, విద్యార్థులను కౌగిలించుకుని ఇచ్చిన బూటకపు హామీలను నమ్మి యువత మోసపోయిందన్నారు.

నాడు ఓట్లు దండుకున్న కాంగ్రెస్ నేతలు, నేడు న్యాయమైన హక్కుల కోసం ప్రశ్నిస్తే విద్యార్థులపై అర్ధరాత్రి దాడులు చేయించి లాఠీ చార్జీలకు తెగబడుతున్నారని ఎంపీ లక్ష్మణ్ ఆరోపించారు. ఉన్నత విద్యే కాకుండా పాఠశాలలు, గురుకులాల వ్యవస్థను సైతం కాంగ్రెస్ సర్కార్ పూర్తిగా నిర్వీర్యం చేసిందని, విద్యా సంవత్సరం ప్రారంభమై నెలలు గడుస్తున్నా పేద విద్యార్థులకు నాణ్యమైన యూనిఫాంలు, పాఠ్యపుస్తకాలు, ఎడ్యుకేషన్ కిట్లు అందించడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఆయన విమర్శించారు. ఫీజు బకాయిలు వెంటనే చెల్లించకపోతే తమ పార్టీ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తుందని ఎంపీ లక్ష్మణ్ హెచ్చరించారు.


ఇంకా ఈ సమావేశంలో బిజెఎల్‌పి నాయకుడు ఏలేటి మహేశ్వర్ రెడ్డి, శాసనమండలి పక్ష నేత ఏవీఎన్ రెడ్డి, ఎంపీలు రఘునందన్ రావు, పాల్వాయి హరీష్ బాబు, ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి, ఎమ్మెల్సీలు మల్క కొమురయ్య, అంజిరెడ్డి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు డాక్టర్ ఎన్. గౌతం రావు, వీరేందర్ గౌడ్, వేముల అశోక్, పార్టీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి, మీడియా ఇన్‌చార్జి ఎన్.వి. సుభాష్, మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ , రాష్ట్ర అధికార ప్రతినిధులు, పార్టీ పదాధికారులు, విద్యార్థి సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.