
చెన్నై: రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సనా దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘పెద్ది’. జాన్వీ కపూర్ ఈ సినిమాలో హీరోయిన్. జూన్ 4వ తేదీన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ జోరుగా ప్రచారం చేస్తున్నారు. వివిధ నగరాల్లో ఈవెంట్లు నిర్వహిస్తున్నారు. రామ్ చరణ్ ప్రతీ ఈవెంట్లో పాల్గొంటూ.. అభిమానుల్లో జోష్ నింపుతున్నారు. తాజాగా ఈ సినిమా ఈవెంట్ చెన్నైలో జరిగింది. ఈ కార్యక్రమంలో రామ్ చరణ్, బుచ్చిబాబు, నటుడు శివరాజ్ కుమార్, సంగీత దర్శకుడు ఎఆర్ రెహమాన్, సినిమాటోగ్రాఫర్ రత్నవేలు తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రామ్ చరణ్ మాట్లాడుతూ.. తమిళనాడు సిఎం విజయ్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. ‘‘సిఎం జోసెఫ్ విజయ్ను చూసి సినీ ఇండస్ట్రీకి చెందిన వ్యక్తిగా నేను ఎంతో గర్వపడుతున్నా. విజయ్‌తో పాటు తమిళనాడు ప్రజలకు శుభాకాంక్షలు. చెన్నై వచ్చినప్పుడల్లా సొంత ఊరికి వచ్చినట్లు అనిపిస్తుంది. మా కుటుంబానికి ఈ నగరంతో ఎంతో అనుబంధం ఉంది. ‘పెద్ది’ కోసం మేమంతా రెండున్నరేళ్లు కష్టపడ్డాం. నేను 285 రోజులు షూటింగ్లో పాల్గొన్నా. మా దర్శకుడు బుచ్చిబాబు అయితే ఐదారేళ్లు కష్టపడ్డాడు. ఎఆర్ రెహమాన్ అద్భుతమైన పాటలు ఇచ్చారు. గత పది, పదిహేను రోజులుగా నిర్విరామంగా పని చేస్తున్నారు. శివన్న తెరపై కనిపిస్తే ఒక ఫైర్ వచ్చినట్లు అనిపిస్తుంది’’ అని అన్నారు.











