
68.5 టన్నుల సహాయ సామాగ్రి.. బేలీ వంతెనలు, సొరంగాల నిపుణుల బృందాలు
కాఠ్మండు: వరదలతో తీవ్రంగా దెబ్బతిన్న నేపాల్‌కు భారత్ 68.5 టన్నుల సహాయ సామగ్రిని అందించడంతోపాటు, గాలింపు, సహాయక చర్యలకు తోడ్పడేందుకు సాంకేతిక బృందాలు, ఫోరెన్సిక్ నిపుణులు, అవసరమైన పరికరాలను పంపినట్లు భారత రాయబార కార్యాలయం తెలిపింది.
బుధవారం సంభవించిన భారీ ఆకస్మిక వరదల కారణంగా జలవిద్యుత్ సొరంగాల్లో కార్మికులు చిక్కుకుపోయినట్లు భావిస్తున్న నేపథ్యంలో.. గాలింపు, సహాయక చర్యల కోసం సొరంగాల నిపుణులతో కూడిన ప్రత్యేక సాంకేతిక బృందాన్ని, అవసరమైన పరికరాలను భారత్ పంపినట్లు కాఠ్మండులోని భారత రాయబార కార్యాలయం శనివారం ఒక ప్రకటనలో తెలిపింది. 11 టన్నుల సహాయ సామగ్రితో నాలుగో విమానం ఆదివారం నేపాల్‌కు చేరినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ ‘ఎక్స్’లో వెల్లడించింది. ఇందులో సొరంగాల్లో గాలింపు, సహాయక చర్యలకు అవసరమైన పరికరాలతో కూడిన సాంకేతిక బృందం, డీఎన్ఏ విశ్లేషణ కోసం ఫోరెన్సిక్ నిపుణుల బృందం ఉన్నట్లు తెలిపింది. దుప్పట్లు, స్లీపింగ్ బ్యాగులు, టార్పాలిన్లు, ప్లాస్టిక్ షీట్లు, పరిశుభ్రత కిట్లు సహా పలు సహాయ సామగ్రిని కూడా పంపినట్లు పేర్కొంది. వైద్యులు, పారామెడికల్ సిబ్బంది, సొరంగాల ఇంజినీర్లతో కూడిన 11 మంది భారత సాంకేతిక బృందం శుక్రవారం కాఠ్మండుకు చేరుకుంది. శనివారం నువాకోట్ జిల్లాలో వరద ప్రభావిత త్రిశూలి ప్రాంతంలోని జలవిద్యుత్ సొరంగాలను ఈ బృందం క్షేత్రస్థాయిలో పరిశీలించింది. రెస్క్యూ చర్యలను ప్రారంభించడానికి ముందు చిలిమే, లాంగ్టాంగ్ ప్రాంతాల్లో బృందం వైమానిక సర్వే కూడా నిర్వహించినట్లు జాతీయ విపత్తు ప్రమాద తగ్గింపు, నిర్వహణ ప్రాధికార సంస్థ తెలిపింది.
సొరంగంలో చిక్కుకున్నట్లు భావిస్తున్న వారిని చేరుకునేందుకు నేపాల్ సైన్యం, సాయుధ పోలీసు దళం, నేపాల్ పోలీసులతో కూడిన 82 మంది సంయుక్త భద్రతా బృందం శుక్రవారం రాత్రి నుంచి శిథిలాలను తొలగిస్తూ సహాయక చర్యలు చేపడుతోంది. డీఎన్ఏ విశ్లేషణ కోసం ఫోరెన్సిక్ నిపుణులు, అవసరమైన పరికరాలతోపాటు దుప్పట్లు, స్లీపింగ్ బ్యాగులు, టార్పాలిన్లు, ప్లాస్టిక్ షీట్లు, పరిశుభ్రత కిట్లను కూడా భారత్ పంపినట్లు భారత రాయబార కార్యాలయం తెలిపింది. విపత్తు నేపథ్యంలో డీఎన్ఏ పరీక్షలు, ఫోరెన్సిక్ సేవలు, ఇతర ప్రత్యేక పనుల కోసం నేపాల్ విదేశీ నిపుణుల సహాయాన్ని కోరింది. ఇదిలా ఉండగా, 230 అడుగుల పొడవైన ఒకే లేన్ మాడ్యులర్ స్టీల్ వంతెన నిర్మాణానికి అవసరమైన పరికరాలతో 16 ట్రక్కులు నేపాల్‌కు చేరుకున్నట్లు భారత రాయబార కార్యాలయం తెలిపింది. మరో ఏడు బేలీ వంతెనల ఏర్పాటుకు అవసరమైన పరికరాలను త్వరలో సరఫరా చేయనున్నట్లు పేర్కొంది. వాటి ఏర్పాటుకు సాంకేతిక బృందాలు కూడా త్వరలో నేపాల్‌కు చేరుకుంటాయని తెలిపింది. వరదలతో దెబ్బతిన్న ప్రాంతాల్లో రవాణా సంబంధాలను పునరుద్ధరించేందుకు 42 బేలీ వంతెనల నిర్మాణానికి నేపాల్ భారత్, చైనాల సహాయాన్ని కోరింది. భారీ యంత్రాలు లేదా ప్రత్యేక పరికరాలు అవసరం లేకుండానే ఈ తాత్కాలిక వంతెనలను వేగంగా ఏర్పాటు చేయవచ్చు.
దేశంలోని వివిధ జలవిద్యుత్ ప్రాజెక్టులకు చెందిన సొరంగాల్లో చిక్కుకున్న 191 మంది కార్మికులను ఇప్పటివరకు నేపాల్ భద్రతా బలగాలు రక్షించినట్లు నేపాల్ సైన్యం తెలిపింది. అయితే మరికొందరు సొరంగాల్లో చిక్కుకున్నట్లు వచ్చిన నివేదికల నేపథ్యంలో నేపాల్ భారత్ సహాయాన్ని కోరింది. నేపాల్టిబెట్ సరిహద్దుకు సమీపంలోని రసువా జిల్లాలోని అప్పర్ త్రిశూలి-1, త్రిశూలి-3 ఏ జలవిద్యుత్ ప్రాజెక్టులకు సంబంధించిన సొరంగాల్లో పలువురు చిక్కుకున్నట్లు భావిస్తున్నారు. సొరంగాల ప్రవేశ మార్గాలను బురద, శిథిలాలు మూసుకుపోవడం, ప్రతికూల వాతావరణ పరిస్థితులు సహాయక చర్యలకు తీవ్ర ఆటంకంగా మారాయి. బుధవారం భోటేకోశి, త్రిశూలి నదీ పరివాహక ప్రాంతాల్లో సంభవించిన ఆకస్మిక వరదల్లో వందలాది మంది ప్రాణాలు కోల్పోగా.. రహదారులు, వంతెనలు, నివాస ప్రాంతాలు, జలవిద్యుత్ మౌలిక సదుపాయాలకు భారీగా నష్టం వాటిల్లింది.








