అమెరికాలోని మసాచుసెట్స్ రాష్ట్రం వెస్ట్‌ఫోర్డ్ నగరం క్రికెట్ సందడికి సిద్ధమవుతోంది. న్యూ ఇంగ్లాండ్ మలయాళీ అసోసియేషన్ ఆధ్వర్యంలో “నేమా క్రికెట్ టోర్నమెంట్ 2026” ఘనంగా నిర్వహించనున్నారు. జూన్ 13, 14, 27, 28 తేదీల్లో ఈ టోర్నీ జరగనుంది. ప్రతిరోజూ ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు మ్యాచ్‌లు కొనసాగనున్నాయి.
వెస్ట్‌ఫోర్డ్‌లోని కల్నల్ జాన్ రాబిన్సన్ స్కూల్ మైదానం ఈ పోటీలకు వేదిక కానుంది. ఇప్పటికే జట్ల నమోదు ప్రక్రియ ప్రారంభమైందని నిర్వాహకులు తెలిపారు. టోర్నీలో పాల్గొనే జట్లు మ్యాచ్ ప్రారంభానికి కనీసం అరగంట ముందుగానే చేరుకుని చెక్-ఇన్ పూర్తి చేయాలని సూచించారు.
క్రీడాభిమానులకు ఉత్కంఠభరితమైన మ్యాచ్‌లు, ఆటగాళ్లకు ప్రతిభ చాటుకునే వేదికగా ఈ టోర్నీ నిలవనుందని నిర్వాహకులు పేర్కొన్నారు. కార్యక్రమానికి పలువురు స్పాన్సర్లు మద్దతు అందిస్తున్నారు. మరిన్ని వివరాల కోసం sports@nemausa.org ను సంప్రదించాలని నిర్వాహకులు కోరారు.

















