మంగళూరులో డ్రగ్స్ అక్రమ రవాణా వ్యవహారం వెలుగులోకి వచ్చింది. హైడ్రో వీడ్ గంజాయిని విక్రయించేందుకు ప్రయత్నించిన 21 ఏళ్ల యువతిని పోలీసులు అరెస్ట్ చేశారు. ముల్కి రైల్వే స్టేషన్ రోడ్డులో మే 12న నిర్వహించిన ప్రత్యేక ఆపరేషన్‌లో సుమారు రూ.35 లక్షల విలువైన 1 కిలో 42 గ్రాముల హైడ్రో వీడ్ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

అరెస్టైన యువతిని శివమొగ్గ జిల్లా సాగర్ తాలూకాకు చెందిన సుహానాగా గుర్తించారు. ప్రస్తుతం ఆమె కుందాపూర్‌లోని ఓ కళాశాలలో ఫైనల్ ఇయర్ బీసీఏ చదువుతోంది. చెన్నై నుంచి మంగళూరుకు మాదకద్రవ్యాలను తీసుకువచ్చి అక్రమంగా విక్రయించాలని ప్రయత్నించినట్లు పోలీసులు తెలిపారు.

ఆపరేషన్ సమయంలో గంజాయితో పాటు మొబైల్ ఫోన్ మరియు ఇతర వస్తువులను కూడా స్వాధీనం చేసుకున్నారు. నిందితురాలిపై ఎన్‌డీపీఎస్ చట్టంలోని సెక్షన్ 8(సి), 20(బి) కింద కేసు నమోదు చేశారు. గతంలో కూడా కవూర్ పోలీస్ స్టేషన్ మరియు బెంగళూరు ఎయిర్‌పోర్ట్ కస్టమ్స్ వద్ద నమోదైన డ్రగ్స్ కేసుల్లో ఆమెకు సంబంధం ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.