తమిళనాడులో రాజకీయ పరిణామాలు మరింత ఉత్కంఠగా మారాయి. ముఖ్యమంత్రి విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వానికి అసెంబ్లీలో జరిగిన విశ్వాస పరీక్షలో మద్దతుగా ఓటు వేసిన 24 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని AIADMK స్పీకర్‌కు ఫిర్యాదు చేసింది. పార్టీ విప్‌కు వ్యతిరేకంగా ఓటు వేసినందున వారిపై ఆంటీ డిఫెక్షన్ లా ప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.
విశ్వాస పరీక్షలో విజయ్ ప్రభుత్వానికి 144 మంది ఎమ్మెల్యేల మద్దతు లభించగా, 22 మంది వ్యతిరేకంగా ఓటేశారు. ఐదుగురు ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు. డీఎంకే సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. AIADMK నేతలు మాట్లాడుతూ, విప్‌ను ఉల్లంఘించిన ఎమ్మెల్యేలు సభ్యత్వాలు కోల్పోయే అవకాశముందని తెలిపారు.
అయితే తిరుగుబాటు ఎమ్మెల్యేలు మాత్రం విప్ నియామకమే చట్టబద్ధం కాదని వాదిస్తున్నారు. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల సమావేశం నిర్వహించకుండా పార్టీ ప్రధాన కార్యదర్శి నేరుగా విప్‌ను నియమించలేరని తెలిపారు. ప్రస్తుతం ఈ వ్యవహారం స్పీకర్ పరిశీలనలో ఉండగా, తుది నిర్ణయం కోర్టు వరకు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి.















